తీరంలో ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ విలవిల..

24 May, 2019 16:02 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఐదేళ్ల నాటి హుద్‌హుద్‌.. ఇటీవలి ఫొని తుపాన్లను మించిన ప్రచండ తుపాను గురువారం రాష్ట్రాన్ని తాకింది. అవి వాతావరణం సృష్టించిన తుపాన్లయితే.. ఇప్పుడు రాష్ట్రాన్ని తాకింది వైఎస్సార్‌సీపీ తుపాను.. ఫ్యాను గాలి ప్రచండమై.. ఝంఝామారుతంలా ప్రజా ఓట్ల రూపంలో వెల్లువెత్తి తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో కూల్చేసింది. ఇద్దరు మంత్రులను మట్టికరిపించింది.

మరో మంత్రిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. జనసేన అధినేత పవన్‌ను.. ఆయన పార్టీ తరఫున రాత్రికి రాత్రి విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా దిగుమతై.. క్రాస్‌ ఓటింగ్‌తో గెలిచేస్తామన్నంత హడావుడి చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణలకు ప్రజాబలం జెల్లకొట్టింది. నడమంత్రపు తాయిలాలు చెల్లవని తేల్చి చెప్పింది. వెరసి.. విశాఖ తీరంలో వైఎస్సార్‌సీపీ ఓట్ల తుఫాను ధాటికి టీడీపీ కోటలు కూలిపోయాయి. గ్రామీణ జిల్లాలో ఫ్యాన్‌ ప్రచండ వేగానికి ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

అర్బన్‌ జిల్లా పరిధిలో మూడు స్థానాల్లో మాత్రమే అతికష్టం మీద నిలదొక్కుకోగలిగింది. ఓట్ల వర్షంలో తడిసి ముద్దయిన వైఎస్సార్‌సీపీ మొత్తం 11 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చివరి రెండు రౌండ్లకు చెందిన నాలుగు ఈవీఎంలు మొరాయించడంతోపాటు ఒక వీవీప్యాట్‌ మిస్‌ కావడంతో లెక్కింపు నిలిచిపోయింది. అర్ధరాత్రి సమయానికి తుది సమాచారం ప్రకారం.. మంత్రి గంటా శ్రీనివాసరావు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 1500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

ఇంకా రెండు రౌండ్ల ఫలితాలు, పోస్టల్‌ బ్యాలెట్ల వివరాలు అందాల్సి ఉన్నందున ఆయన గెలుపు గాలిలో ఉన్నట్లే.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఈ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు తెలుగుదేశం మంత్రులను ముప్పుతిప్పలు పెట్టి మట్టికరిపించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడును సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం ప్రజలు ఈసారి పక్కన పెట్టారు.

ఓటమి రుచి చూపించారు. ఇక తండ్రి మరణం నేపథ్యంలో.. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి వెలగబెట్టిన కిడారి శ్రావణ్‌కుమార్‌పై అరకు ప్రజలు ఏమాత్రం కరుణ చూపలేదు. వైఎస్సార్‌సీపీపై వారికి ఉన్న ఆదరణ ముందు తండ్రి మరణించారన్న సెంటిమెంట్‌ కూడా పని చేయలేదు. ఏకంగా నోటా కంటే తక్కువ ఓట్లు వేసి అట్టడుగుకు నెట్టేశారు. విశాఖ ఉత్తర నుంచి పోటీ చేసిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావును సైతం చివరి రౌండ్ల వరకు ఓటర్లు చుక్కలు చూపించారు. తుది సమాచారం అందేసరికి ఆయన అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు