ఉపాధ్యాయునిపై దాడి

5 Jan, 2014 00:48 IST|Sakshi

=ఉపాధ్యాయుల మధ్య విభేదాలే కారణం
 =బాధ్యులపై చర్యలు: డీఈవో  
 = దళిత సంఘాల ఆందోళన

 
గండేపల్లి(కంచికచర్ల రూరల్), న్యూస్‌లైన్ : సమాజంలో ఆదర్శవంతంగా నడచుకోవాల్సిన ఉపాధ్యాయులే వీధిరౌడీల్లా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది. విద్యార్థులను విజ్ఙానవంతులుగా తీర్చిదిద్దాల్సిన వారే  తరగతి గదులకోసం ఘర్షణపడి    కొట్లాడుకున్న ఘటన  శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కంచికచర్ల మండలం గండేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  పనిచేస్తున్న చిలకా విక్టర్ నగేష్‌బాబు, మిరి యాల కల్పన  అనే ఉపాధ్యాయుల మధ్య తరగతి గదుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కల్పన గొడవ  విషయమై కంచికచర్లలోని తమ బంధువులకు సమాచారం అందించింది.  స్కార్పియో కారులో వచ్చిన  ఐదుగురు వ్యక్తులు పిల్లలకు పాఠాలు బోధిస్తున్న  విక్టర్‌ను బయటకు పిలిచి చితకబాదారు. ఇది గమనించిన గ్రామస్తులు ఉపాధ్యాయున్ని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా... వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు వారిని మందలించి పోలీసులకు తెలిపారు.
 
పోలీసుల విచారణ...

రూరల్ సీఐ ఎం.రాంకుమార్, కంచికచర్ల ఎస్‌ఐ ఏ దుర్గాప్రసాద్  తన సిబ్బందితో పాఠశాలకు చేరుకుని  ఈ విషయమై విచారణ చేపట్టారు.  ఇరువురి నుంచి ఫిర్యాదులు తీసుకుని ఉపాధ్యాయునిపై చేయిచేసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.

 చర్యలు తీసుకుంటాం: డీఈవో

 ఉపాధ్యాయునిపై మరో ఉపాధ్యాయురాలు బయటి వ్యక్తులతో దాడి చేయించడం హేయమై న చర్య అని,  పూర్తిస్థాయి విచారణ చేపట్టి  చర్య లు తీసుకుంటామని డీఈవో దేవానందరెడ్డి, ఎంఈవో  సదాశివరావు తెలిపారు.
 
దాడి హేయమైనచర్య ఎంఆర్‌పీఎస్ ....
 
ఒకే పాఠశాలలో పనిచేస్తూ  బయటి వ్యక్తులను రప్పించి ఓ దళిత ఉపాధ్యాయుడిపై దాడి చేయించటం హేయమైన చర్య అని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొండపాటి సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో పాఠశాలలో ఆందోళన చేపట్టారు. అగ్రవర్ణాలకు చెందిన  మిరియాల కల్పన రౌడీలను పిలిపించి దాడి చేయించారని, ఉపాధ్యాయురాలిని  వెంటనే సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంఆర్‌పీఎస్  నేతలు డిమాండ్ చేశారు.
 
పలు ఉపాధ్యాయ  సంఘాల ఖండన...
 
విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడు విక్టర్‌నగేష్‌పై అదే పాఠశాలలో పనిచేస్తున్న  మరో ఉపాధ్యాయురాలు మిరియాల కల్పన దాడి చేయించడం తగదని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి.   
 

>
మరిన్ని వార్తలు