ఈ మాస్టారు మాకొద్దు బాబోయ్!

1 Jul, 2014 01:29 IST|Sakshi
ఈ మాస్టారు మాకొద్దు బాబోయ్!

ఆత్రేయపురం :వెలిచేరు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులను కర్రతో తలపై కొట్టిన ఉపాధ్యాయుని తీరును గర్హిస్తూ ఆయనను తక్షణం బదిలీ చేయాలనే డిమాండ్‌తో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జెడ్పీ హైస్కూల్లో మెర్ల జానకీరామారావు ఎన్‌ఎస్ ఉపాధ్యాయుడు. శనివారం క్లాస్‌లో విద్యార్థులను ప్రశ్నలు వేసిన సందర్భంగా జవాబులు సరిగా చెప్పలేదని కోపం వచ్చిన జానకీరామారావు పెరవలి విజయలక్ష్మి, మెరిపే ఉదయకుమార్‌లను తలపై పేకబెత్తంతో బలంగా కొట్టారు.
 
 నొప్పిని భరించలేక వారిద్దరూ ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయారు. తలనొప్పిగా ఉందని, కళ్లు కూడ సరిగా కనిపించడం లేదని వారు తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామంలో కలకలం రేగింది. ఈ ఘటనకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు వెళ్లగా అప్పటికే ఆయన వెళ్లిపోయారని చెప్పారు. దీంతో సోమవారం ఉదయం మళ్లీ స్కూలుకు వెళ్లిన గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో నేరుగా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకుని ఎంఈఓ కె నరసింహరెడ్డికి ఫిర్యాదు చేశారు. విచక్షణ మరచిపోయి విద్యార్థులను శిక్షించే టీచర్ మాకు వద్దని వారు ఎంఈఓకు స్పష్టం చేశారు. సక్రమంగా పాఠాలు చెప్పడం తెలియని జానకీరామారావు ఉపాధ్యాయవృత్తికి పనికిరారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  తక్షణమే ఆయనను మరో పాఠశాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే గ్రామంలో జరిగే ఆందోళనలకు విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తదుపరి పాఠశాలకు చేరుకుని తమ ఫిర్యాదును హెచ్‌ఎం వీరభద్రరావుకు కూడా అందజేశారు. దీనిపై డీఈఓకు సైతం ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. కునాధరాజు రంగరాజు, కవల రాఘవులు, కొత్తపల్లి ప్రసాద్, ఏసులంక సత్యనారాయణ, ఇళ్ల రాము, సుంకర వీరన్న, మట్టా ఊదలయ్య, గుమ్మడి గణపతి తదితరులు వారిలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు