తప్పతాగి పాఠశాలకు..

5 Jul, 2015 01:42 IST|Sakshi

 పలాస రూరల్: భావిభారత పౌరులను దిద్దవలసిన ఓ ప్రధాన ఉపాధ్యాయుడు తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో పాఠశాలలో వీరంగం సృష్టించి చివరికి సస్పెండ్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే...గరుడుఖండి పంచాయతీ పాత జగదేవుపురం ప్రాథమిక పాఠశాలలో దాసరి రామారావు ఆరేళ్లుగా ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. రోజూ తప్పతాగి పాఠశాలకు వస్తున్నాడు. తరగతి గదిలోనే మద్యం మత్తులో జోగుతుండడం నిత్య కృతమయింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖాధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రామారావు రాజకీయ పలుకుబడి చూపించి కుటుంబ సభ్యులతో అధికారుల కాళ్లవేళ్లా పడి బతిమాలి అధికారుల చర్యల నుంచి తప్పించుకుంటున్నాడు.
 
 గతంలో ఇలా పలుమార్లు జరిగింది. శనివారం కూడా తాగి వచ్చి తరగతి గతిలో వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఎంఈవో సుడియా సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వచ్చి పరిశీలించిన ఎంఈవో పరిస్థితిని డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుకునేవారని.. రామారావు చేష్టలతో సగం మంది విద్యార్థులు బడి మానేశారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో చదివించే స్థోమతలేక ప్రభుత్వ బడికి తమ పిల్లలను పంపుతున్నాం.. ఓ హెచ్‌ఎం ఇలా తాగి వచ్చి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు.. ఎలా బాగుపడతారని అని పశ్నిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు