ఎప్పుడూ నీ గురించే ఆలోచనంటూ గురువు ప్రేమలేఖ!

29 Nov, 2019 09:03 IST|Sakshi

సాక్షి, అనంతపురం: తల్లిదండ్రుల తర్వాత గురువు దేవుడితో సమానం అంటారు. అదే నమ్మకంతోనే తల్లిదండ్రులు యుక్తవయసులో ఉన్న ఆడ పిల్లలను కూడా ధైర్యంగా పాఠశాలలకు పంపుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువుకు సమాజంలో ఎనలేని స్థానం ఉంది. అయితే గురువు అనే పదానికి మాయని మచ్చలా వ్యవహరించాడు రామగిరి మండలం నసనకోటలోని మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలోని ఓ టీచరు. వివరాల్లోకి వెళ్తే.. ఈ స్కూల్‌లో 5 నుంచి 9వ తరగతి వరకు బాలికలు చదువుతున్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు కొంతకాలంగా ఓ విద్యార్థినిపై కన్నేశాడు. అభంశుభం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు.

తరచూ ఆ బాలికతో ప్రత్యేకంగా మాట్లాడేవాడు. వెకిలిచేష్టలకు పాల్పడేవాడు. తోటి విద్యార్థినులతో పాటు కొందరు ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించారు. సదరు టీచరును హెచ్చరించినట్లు తెలిసింది. అయినా అతడిలో మార్పు రాలేదు. తరచూ బాలికకు ప్రేమలేఖలు రాస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం గుట్టుగా వ్యవహరించింది. అదికాస్తా గ్రామస్తులకు నాలుగు రోజుల కిందట తెలిసింది. స్కూల్‌కు వచ్చి యాజమాన్యంతో గొడవకు దిగారు. కీచక గురువుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో సదరు టీచరును మూడు రోజుల కిందట స్కూల్‌ నుంచి పంపించేశారు. చిన్నపిల్లలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఇలాంటి టీచర్లను శిక్షించాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై స్కూల్‌ ప్రిన్సిపల్‌ సంగీతకుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆ టీచరును స్కూల్‌ నుంచి తప్పించామన్నారు.

మరిన్ని వార్తలు