గురువా.. నీకిది తగునా!

16 Nov, 2014 03:01 IST|Sakshi
గురువా.. నీకిది తగునా!

పెద్దపంజాణి: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం పెద్దపంజాణి మండలంలోని రాయలపేట ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం మేరకు.. రాయలపేట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు శ్రీరాములు కొంత కాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఏడాది క్రితం ఈ విషయం గమనించిన ప్రధానోపాధ్యాయుడు అత న్ని మందలించారు. మార్పు రాలేదు. ఆరు నెలలుగా తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించేవాడు. వేధిం పులు భరించలేక ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెప్పింది.  

పాఠశాలకు వెళ్లనని మొండికేసింది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. శనివారం పాఠశాలకు వెళ్లిన గ్రామస్తులు సదరు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం నారాయణ డీఈవో ప్రతాప్‌రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. పెద్దపంజాణి ఎంఈవో వెంకట్రమణ విచారణ చేపట్టారు. అతను వేధింపులకు పాల్పడింది నిజమేనని, అతనికి మరో ముగ్గురు ఉపాధ్యాయులు సహకరించారని విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఎంఈవోకు తెలియజేశారు. ఎంఈవో నివేదిక మేరకు సదరు హిందీ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తూ డీఈవో ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై సోమవారం క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. అదే పాఠ శాలకు చెందిన ఇంగ్లిషు టీచర్ అక్బర్ హుస్సేన్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఉపాధ్యాయులకు ఎంఈవో క్లాస్..
పాఠశాలలో ఆరు నెలలుగా ఇలాంటి ఘటనలు  జరుగుతున్నా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఉపాధ్యాయులపై ఎంఈవో వెంకట్రమణ మండిపడ్డారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని హితబోధ చేశారు.

>
మరిన్ని వార్తలు