టీచర్‌ పోస్టుల భర్తీ షురూ

22 Jun, 2019 05:07 IST|Sakshi

తొలికేటగిరీ కింద ప్రిన్సిపాల్‌ పోస్టులకు ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ జాబితా విడుదల

నేడు, రేపు ధ్రువపత్రాల అప్‌లోడ్‌కు అవకాశం 

24న పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన

ఈసారి అంతా ఆన్‌లైన్‌లోనే.. పోస్టులు మిగలకుండా ఆప్షన్‌ అవకాశం

మెరిట్‌ లిస్టులోని తదుపరి అభ్యర్థికి అవకాశం

సాక్షి, అమరావతి: టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ – 2018 నియామకాల ప్రక్రియ గురువారం రాత్రి నుంచి ప్రారంభమైంది. తొలుత మోడల్‌ స్కూళ్లు, ఏపీ బీసీ వెల్ఫేర్‌ స్కూళ్లలో ప్రిన్సిపాల్‌ పోస్టుల ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితాను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెలెక్షన్‌ కమిటీ పరిశీలించి ఖరారు చేసిన అనంతరం జాబితాను శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థులు దీన్ని అనుసరించి శని, ఆదివారాల్లో ధ్రువపత్రాలను నిర్దేశిత వెబ్‌సైట్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. ఐదు కేటగిరీల పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది.  

సెప్టెంబర్‌ 4తో ముగియనున్న షెడ్యూల్‌.. 
రాష్ట్రంలో 7,902 పోస్టుల భర్తీకి డీఎస్సీ – 2018 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్‌ జాబితాలను ఇంతకు ముందే ఖరారుచేసినా ఎన్నికల కోడ్, కోర్టు కేసుల వల్ల జిల్లాలవారీగా సెలెక్షన్‌ జాబితాల విడుదలలో జాప్యం జరిగింది. ఎన్నికల కోడ్‌ ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఇటీవల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేయడం తెలిసిందే. తొలిసారిగా పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోస్టులు మిగిలిపోకుండా ఉండేందుకు విభాగాల వారీగా వేర్వేరుగా షెడ్యూళ్లను ప్రకటించారు. అదే సమయంలో ఆయా విభాగాల్లో మూడు నాలుగుసార్లు ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ జాబితా విడుదల చేసేలా చర్యలు చేపట్టారు. ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఐదు కేటగిరీల పోస్టుల భర్తీకి వీలుగా ఐదు షెడ్యూళ్లలో కొనసాగుతుంది. సెప్టెంబర్‌ 4వ తేదీతో ముగిసేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది.
 
పోస్టులు మిగలకుండా చర్యలు 
గతానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖ ఈసారి భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ జాబితాల విడుదల, కన్ఫర్మేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్, పరిశీలన, అనంతరం ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ జాబితాల విడుదల ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చివరిగా తుది సెలెక్షన్‌ జాబితా ప్రకటించి అభ్యర్ధులకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం పోస్టింగ్‌ ఆర్డర్లు ఇస్తారు. ప్రొవిజనల్‌ ఎంపిక జాబితాలను మూడు దఫాలుగా ఇవ్వడం వల్ల ఎవరైనా అనర్హతతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చినా ఆ పోస్టు మిగలకుండా తదుపరి మెరిట్‌ అభ్యర్థికి అవకాశమిచ్చేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఒకే అభ్యర్థి పలు కేటగిరీల్లోని పోస్టులకు ఎంపికైనా ఏ పోస్టులో చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారో ముందుగానే ఆప్షన్‌ ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అన్ని ప్రొవిజనల్‌ జాబితాలు వెలువడిన అనంతరం వారికి ఆప్షన్‌కు అవకాశం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల అలాంటి అభ్యర్ధులు ఏదో ఒక పోస్టుకు ఆప్షన్‌ ఇస్తే మిగతా పోస్టులకు మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థిని ఎంపిక చేస్తామని వివరించారు. తద్వారా ఏ కేటగిరీలోనూ పోస్టులు మిగలకుండా అర్హులైన అభ్యర్ధుల ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు వివరించారు.  

ప్రిన్సిపాల్‌ పోస్టులకు ఈ ధ్రువపత్రాలు తెచ్చుకోవాలి... 
ప్రిన్సిపాల్‌ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులు పరిశీలన కోసం వచ్చే సమయంలో నిర్ణీత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటిమేషన్‌ లెటర్, అప్లికేషన్‌ ఫారం, హాల్‌టిక్కెట్, అర్హత ధ్రువపత్రాలు, ఎస్సెస్సీ సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ తత్సమాన ధ్రువపత్రాలు, ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్‌ పత్రాలు, బీఈడీ, ఎంఈడీ తత్సమాన సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు), మాజీ సైనికోద్యోగుల సర్టిఫికెట్లు, దివ్యాంగ అభ్యర్థులు సంబంధిత మెడికల్‌ బోర్డు ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలి. ఒరిజినల్‌  పత్రాలతో పాటు మూడు సెట్ల నకలు ధ్రువపత్రాల కాపీలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు.

ధ్రువపత్రాల పరిశీలన శని, ఆదివారాల్లో ఉంటుందన్నారు. ఈ రెండు రోజుల్లో అభ్యర్ధులు ‘సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో  ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అనంతరం అభ్యర్ధులు ఈనెల 24వ తేదీన 9 గంటల నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలోని మోడల్‌ స్కూల్‌ విభాగంంలో నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితాలో ఉన్న అభ్యర్ధులంతా హాజరు కావాలన్నారు. మోడల్‌ స్కూళ్లు, బీసీ వెల్ఫేర్‌ స్కూళ్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు ఏదో ఒక మేనేజ్‌మెంట్‌ స్కూల్‌కు ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుందని కమిషనర్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు