కీచక టీచర్‌ లొంగుబాటు ?

17 Dec, 2017 11:52 IST|Sakshi

సాక్షి, గూడెంకొత్తవీధి: గిరిజన విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన  కీచకగురువు రామకృష్ణ పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది.  వివరాల్లోకి వెళ్తే... చింతపల్లిలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని, తనకు వరుసకు బావైన గూడెంకొత్తవీధి ఏకలవ్య పాఠశాలలో టెన్త్‌ చదువుతున్న లోవ శ్రీనును చూసేందుకు వచ్చింది. 

హాస్టల్‌ గదిలో శ్రీనుతో  ఆమె మాట్లాడుతుండగా  గమనించిన ఉపాధ్యాయుడు రామకృష్ణ వారిని బెదిరించి, ఆమెపై లైంగిక దాడి చేశాడు. అంతే కాకుండా పాఠశాలలో వాచ్‌మన్‌గా పని చేస్తున్న చిరంజీవికి చెందిన అద్దె ఇంటిలో కూడా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ నెల 7న తనకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఈ విషయాన్ని  తల్లిదండ్రులు, బంధువులకు బాధిత విద్యార్థిని తెలిపింది. 

అదే రోజు వారు చింతపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ తోపాటు పోస్కో తదితర చట్టాల కింద కీచక టీచర్‌పై  డీఎస్పీ అనిల్‌ పులిపాటి కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి రామకృష్ణ పరారీలో ఉన్నాడు.  గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుండడంతో ఈనెల 8న పాడేరు డీడీ  విజయకుమార్‌ పాఠశాలను సందర్శించి, విచారణ  చేసి రామకృష్ణను సస్పెండ్‌  చేశారు.  పాడేరు సబ్‌ కలెక్టర్‌ డీకే బాలాజీ, రెవెన్యూశాఖ అధికారులకు, డీఎస్పీ రైటర్‌ శ్రీనును దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.  శుక్రవారం చింతపల్లి డీఎస్పీ నేరుగా  విచారణ చేపట్టడంతో ఎట్టకేలకు కీచక గురువు శనివారం జీకేవీధి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు  సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. 
 

మరిన్ని వార్తలు