పిల్లల్లో నైతికత పెంపొందించే బాధ్యత గురువులదే

15 Dec, 2019 04:04 IST|Sakshi
ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ హరిచందన్‌. చిత్రంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌  

సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): చిన్నారుల్లో నైతికతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలలోని నీతి, నైతికతలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని ఆయన సూచించారు. శ్రీ పావని సేవా సమితి రూపొందించిన మహాభారతం, రామాయణం, భగవద్గీత పుస్తకాలను శనివారం రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో గవర్నర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత సారాన్ని నేర్పించే భగవద్గీత భారతదేశంలోనేగాక ఇతర దేశాల విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లోనూ చేర్చినట్టు తెలిపారు. 

మహాభారతంలో కర్ణుడి పాత్రపై ‘అభిసప్తా కర్ణ’ అనే పేరుతో ఒడియాలో తాను ఒక పుస్తకం రాశానని తెలిపారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రామాయణం, మహాభారతం, భగవద్గీత మొదలైన ఇతిహాస పుస్తకాలను తీసుకురావడంలో పావని సేవా సమితి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వీటి రూపకల్పన జరిగిందని, ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయులకు ఉచితంగా వీటిని పంపిణీ చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో చల్లా సాంబిరెడ్డి, పావని సేవా సమితి బాధ్యులు ఆచార్య ముత్యాల నాయుడు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు