అడవిలో అక్షర దివిటీలు

24 Mar, 2018 12:39 IST|Sakshi
ఒడిశా రాష్ట్ర పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు

సాక్షి చొరవతో కొఠియాకు కొత్తశోభ

రెండు రాష్ట్రాలను కదిలించిన కథనాలు

ఇప్పుడిప్పుడే చదువులకు చేరువవుతున్న గిరిబిడ్డలు

వారికి పాఠాలు బోధించేందుకు పెరిగిన పోటీ

ఒడియా... తెలుగు పాఠాలతోపునీతమైన గిరిసీమ

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా పల్లెలు. నిన్న మొన్నటివరకూ అక్కడి పరిస్థితులు దయనీయం. వారిని పట్టించుకునేవారిని కనం. అక్కడి పరిస్థితులను సాక్షి పరిశీలించింది. అంతే ఆర్ద్రంగా అక్షరీకరించింది. రెండు రాష్ట్రాల అధికారులను కదిలించింది. అంతే... అడవి మధ్యన, కొండల మాటున అభివృద్ధికి, అక్షరానికి దూరమైన అక్కడి ప్రజల జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అక్షర సుగంధాలు పరిమళిస్తున్నాయి. 21 గ్రామాల్లో మళ్లీ చదువుల తల్లి పరవశిస్తోంది. ఇరు రాష్ట్రాల ఉపాధ్యాయులు కొఠియా పల్లెలకు క్యూ కడుతున్నారు. గిరిజన బిడ్డలకు చదువులు చెప్పేందుకు పోటీపడుతున్నారు.

సాక్షిప్రతినిధి విజయనగరం : దశాబ్దాలుగా మారని వారి బతుకుల్లో వెలుగులకు కారణం ‘సాక్షి’ దినపత్రిక కావడం గర్వకారణం. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, పాలకులు, అధికారులకు ఆమడ దూరంగా కొఠియా ప్రజలు అనుభవిస్తున్న దుర్భర జీవితాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకితీసుకువచ్చింది. క్షేత్ర స్థాయిలో ‘సాక్షి’ తొలిసారిగా కొఠియా పల్లెల్లో పర్యటించి అక్కడి వారి కన్నీటి వ్యధలను కళ్లకు కట్టినట్టు ప్రముఖంగా ప్రచురించి పాలకుల 0కళ్లు తెరిపించింది. ఫలితంగా కొఠియా ప్రజల జీవితాల్లో పెను మార్పు మొదలైంది. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన ఈ గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఆ ప్రయత్నంలో ఒక భాగం ఈ విద్యా వికాసం. ‘సాక్షి’ పది వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ చరిత్రలో నిలిచిపోయే మార్పునకు ఇది శ్రీకారం.

పోటాపోటీగా ఏపీ, ఒడిశా బోధనలు
కొఠియా గ్రామాల్లో ఒక్కో రాష్ట్రానివి 14 చొప్పున 24 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి నిర్వహణను రెండు రాష్ట్రాల వారు వేర్వేరుగా చూసుకుంటున్నారు. గ్రామాల్లోని ఐదేళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో, 5 సంవత్సరాలు పైబడినవారిని స్థానిక పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఒక విద్యార్థి పేరు రెండు రాష్ట్రాల పాఠశాలల్లోనూ నమోదు చేస్తున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మాత్రం ఉపాధ్యాయులు రావడం లేదు. కానీ ఇప్పుడులా గ్రామాల్లో ఆంధ్రా–ఒడిశా అధికారులు తరచుగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పాఠశాలలను ఒడిశా అధికారులు పరిశీలించినప్పుడు గ్రామంలోని విద్యార్థులు ఆంధ్రా ప్రాంతంలోని పాఠశాలలో ఉండటాన్ని గమనించారు. వెంటనే ఒడిశా ప్రభుత్వం స్పందించింది. ఒడియా బోధనకు ఉపాధ్యాయులను పురమాయించింది. ఇటు ఆంధ్రా ప్రాంతంలోనూ అదే పరిస్థితి. మొత్తమ్మీద అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి రెండు రాష్ట్రాల ఉపాధ్యాయులు పోటీపడుతున్నారు.

ప్రతిష్టాత్మకంగా ఒడిశా ప్రభుత్వం
ఇటీవల ధూళి¿భద్ర గ్రామంలో ఆంధ్రా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న  అంగన్‌వాడీ కేంద్రాన్ని ఒడిశా అధికారులు పరిశీలించారు. అక్కడ ఏపీ రాష్టర బోర్డు ఉండడాన్ని గమనించారు. ఆ భవనం ఒడిశా ప్రభుత్వం నిర్మించినందున అక్కడ ఏపీ కేంద్రాన్ని నిర్వహించడాన్ని తప్పు పట్టారు. తక్షణమే బోర్డు  తీయాలని లేదంటే వేరే భవనం వద్ద ఆ కేంద్రాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలానే ఇటీవల కాలంలో అక్కడ చోటు చేసుకుంటున్నాయి. అక్షరాన్ని వారానికోరోజు ఒక పూట నేర్చుకోవడమే గగనమనుకునే ప్రాంతంలో కేవలం ‘సాక్షి’ కథనాల వల్ల విద్యార్థులకు నిత్యం విద్య అందే పరిస్థితులు వచ్చాయి. భావితరాల భవిష్యత్తుకు బాటలు ఏర్పడ్డాయి.

మరిన్ని వార్తలు