టీచర్లకు ప్రత్యేక వేతన స్కేళ్లు ఇవ్వాలి

25 Sep, 2013 05:30 IST|Sakshi

 కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఉపాధ్యాయులకు ప్రత్యేక వేతన స్కేళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు కెఎస్.లక్ష్మణరావు, వి.బాలసుబ్రమణ్యం పదవ వేతన సంఘం కమిషనర్ పీకే అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం లో ఆయనను కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు జరిపారు. వారు మాట్లాడుతూ ప్రతిభావంతులకూ, నిబద్ధతతో పనిచేస్తున్న టీచర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ప్రతి వేతన కమిటీ అమలులో సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతున్నారన్నారు. సర్వీస్ వెయిటేజీ ఇవ్వటం ద్వారా స్పెషల్ ప్రమోషన్ స్కేలు పొందడానికి ఉపాధ్యాయులందరికీ ఒకే అర్హత, ఒకే వేతనం అందివ్వాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా సెలవులు, ఎల్‌టీసీ అలవెన్సులు చెల్లించాలన్నారు. కనీస వేతనం చెల్లిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనాలు చెల్లించాలని కోరారు. 15 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. 60శాతం పెన్షన్, రూ. 8 నుంచి రూ 15 లక్షల వరకు గ్రాట్యుటీ పెంపు తదితర అంశాలను పరిశీలించాలని ఎమ్మెల్సీలు కమిషనర్‌ను కోరారు.
 
 కంప్యూటర్ విద్య  కొనసాగించాలి....
 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ను విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, వి బాలసుబ్రమణ్యంలు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రాజేశ్వర్‌తివారి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాణిమోహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కంప్యూటర్ ఉపాధ్యాయులను నూతనంగా ప్రారంభం కాబోతున్న 4,031 పాఠశాల ప్రాజెక్టుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న నిధుల్లో 25శాతం నిధులు వెచ్చిస్తే కంప్యూటర్ ఉపాధ్యాయులను కొనసాగించవచ్చని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు