‘ముక్క’మాటానికిపోయి.. 

3 Aug, 2019 08:47 IST|Sakshi

ఓ స్కూల్‌ మాస్టారు.. కారు కొన్నారు. మిగిలిన మాస్టార్లు కారు కొన్నందుకు పార్టీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇంకేముంది.. పాపం సారు.. మొహమాటానికి.. సారీ ‘ముక్క’మాటానికి పోయారు. కక్క, ముక్కలతో మాంసాహారాన్ని వండించారు. అంతేకాదు.. క్యారియర్లతో ఏకంగా స్కూల్‌కు తీసుకువచ్చేశారు. అయితే తాము చదువు చెబుతున్న పాఠశాల అన్నవరం దేవస్థానానికి చెందిన సంస్కృతోన్నత పాఠశాలని మరిచారో ఏమో!.. కొండపై సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న వేళ మాంసాహార విందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరికి విషయం ఆలయ అధికారులకు తెలియడంతో ఆ మాస్టార్లు చిక్కుల్లో పడ్డారు. 

సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : ఒకవైపు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రత్నగిరిపై భక్తి శ్రద్ధలతో దేవస్థానం అధికారులు వేడుకలు నిర్వహిస్తుంటే.. కొండదిగువన దేవస్థానం నిర్వహణలో గల సంస్కృతోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మాంసాహారం భుజించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఈఓ ఎంవీ సురేష్‌ బాబు మధ్యాహ్నం  హుటాహుటిన హైస్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ మాంసాహారాన్ని ఊరి చివర పారబోయించారు. ఈ మాంసాహార భోజనం హైస్కూల్‌కు తీసుకువచ్చిన స్కూల్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయగా, క్యారియర్‌లను తన గదిలో ఉంచిన పీఈటీ చక్రధరరావుకు షోకాజ్‌ నోటీసు అందజేశారు.

పార్టీ అడిగారని..
అన్నవరం దేవస్థానం 50 ఏళ్లుగా కొండదిగువన, ప్రస్తుత మొదటి ఘాట్‌రోడ్‌ పక్కన సంస్కృతోన్నత పాఠశాల నిర్వహిస్తోంది. ఈ స్కూల్లో సంస్కృతం ప్రధాన భాషగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. ఇక్కడ హైస్కూల్‌ ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు కూడా పర్వదినాల్లో దేవస్థానంలో పలు రకాలుగా సేవలందిస్తుంటారు. హైస్కూల్‌లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌ ఇటీవల కారు కొనుకొన్నందున ఇతర ఉపాధ్యాయులు ఆయనను పార్టీ అడిగారు. ఆయన మాంసాహారాన్ని వండించి రెండు క్యారియర్లతో హైస్కూల్‌కు తెచ్చి పీఈటీ గదిలో ఉంచారు. దేవస్థానంలో స్వామివారి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈఓకు ఈ మేరకు సమాచారం రావడంతో మధ్యాహ్నం 12.30 కు దేవస్థానం హైస్కూల్‌కు చేరుకుని తనిఖీ చేశారు.

ఆ తనిఖీల్లో పీఈటీ గదిలో ఒక పెద్ద క్యారియర్‌లో బిర్యానీ, మరో క్యారియర్‌లో మాంసం కూర ఉండడంతో దీనిపై ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా సహచర ఉపాధ్యాయులు పార్టీ అడగడంతో తెచ్చానని తెలిపారు. దీనిపై పీఈటీ చక్రధరరావును ప్రశ్నించగా తన గదిలో ఆ క్యారియర్లను పెట్టమని తాను చెప్పలేదని సమాధానమిచ్చారు. వారిద్దరి స్టేట్‌మెంట్లతో పాటు ఇతర ఉపాధ్యాయుల స్టేట్‌మెంట్లు కూడా ఈఓ రికార్డు చేయించారు. అనంతరం స్కూల్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్, పీఈటీ ఎం.చక్రధరరావులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కూడా చాలాసార్లు ఇలానే హైస్కూల్లో మాంసాహారం తీసుకున్నట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు