పకడ్బందీగా టెట్‌

18 Feb, 2018 09:22 IST|Sakshi

నెల్లూరు(పొగతోట): టీచర్స్‌ ఎల్జిబిలిటీ టెస్ట్‌ 2018 (టెట్‌) ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో నిర్వహించిన ఏపీ టెట్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. విట్స్‌ కావలి, శ్రీవెంకటేశ్వర కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (నార్త్‌రాజుపాళెం), నారాయణ ఇంజినీరింగ్‌ కాలేజీ (ముత్తుకూరు రోడ్డు), ఐమాన్‌ డిజిటల్‌ జోన్‌ కాలేజీ (కొడవలూరు), ఎన్‌బీకేఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (విద్యానగర్‌), ఆదిశంకర ఇంజినీరింగ్‌ కాలేజీ, గూడూరు (రెండు సెంటర్లు), రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ (కడనూతల) సెంటర్లలో టెట్‌ నిర్వహిస్తామన్నారు.

 ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నిర్వహించే కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీల్లో ఉన్న సభ్యులు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి, నివేదికలను డీఈఓకు అందజేయాలని సూచించారు. టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష నిర్వహించే సమయాల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇన్విజిలేటర్ల వద్ద సెల్‌ఫోన్లు ఉండకూడదన్నారు. టెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల వద్ద బ్లూటూత్, సెల్‌ఫోన్లు ఉండకుండా పరిశీలించాలన్నారు. వాటర్‌ బాయ్స్‌ సెల్‌ఫోన్లతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లకుండా ఇన్విజిలేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ శామ్యూల్, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ విజయకుమార్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం, పోలీసు, మున్సిపల్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు