పది వేల మందితో మహాగర్జన

8 Sep, 2013 02:44 IST|Sakshi
గరివిడి, న్యూస్‌లైన్: గరివిడి పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు పది వేల మందితో జరిగిన మహా గర్జన విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి ఆందోళనుకైనా సిద్ధమేన్నారు. అవసరమైతే ప్రాణాలైన త్యాగం చేద్దామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే తాగు, సాగునీటి సమస్యలతో పాటు ఉద్యోగాల సమస్యలు తలెత్తుతాయన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భావితరానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సోనియాగాంధీ దేశంలో ఇటలీ పరిపాలన కొనసాగిస్తోందని విమర్శించారు.
 
కాగా అంతకముందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పది వేల మందితో గరివిడి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ఆర్‌ఓబీ వరకు ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, సమైక్యవాదులు, వివిధ వేషధారణ, నృత్యాలతో నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి, ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్.రామకృష్ణారావు, ఉపాధ్యాయ సంఘ నేతలు ఎ.సత్యశ్రీనివాస్, కె.ఈశ్వరరావు జేఏసీ నాయకులు వై. సత్యం, బి. శ్రీదేవి, పంచాయతీ సర్పంచ్ బమ్మి డి కృష్ణమ్మ, మాజీ ఉప సర్పంచ్ బమ్మిడి అప్పలస్వామి, తదితరులు  పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు