విద్యాశాఖలో  పదోన్నతుల సందడి

17 Aug, 2019 10:52 IST|Sakshi

స్కూల్‌ అసిస్టెంట్లుగా  ఎస్జీటీలు..

పదవీ విరమణ, ప్రమోషన్లతో ఏర్పడిన  89 ఖాళీల భర్తీకి చర్యలు

సీనియారిటీ జాబితా వెల్లడి

నేడు సర్టిఫికెట్ల పరిశీలన

22న కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు

శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖలో పదోన్నతుల పర్వానికి ప్రభుత్వం తెర తీసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు నడుం బిగిం చింది. ఇలా  జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఏర్పడిన మొత్తం 89 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం సెకండరీ గేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), తత్సమానమైన ఉపాధ్యాయ కేడర్‌ వారి ధ్రువపత్రాల పరిశీలనకు ముహూర్తం ఖరారు చేశారు.

సీనియారిటీ జాబితా సిద్ధం...
జిల్లాలో పదోన్నతులకు అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్‌ టీచర్ల సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు సిద్ధం చేశారు. డీఈఓ వెబ్‌సైట్‌లో సీనియారిటీ జాబితాను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పదోన్నతులకు సంబం ధించి ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు.. ఆ తరువాత పర్వానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు.

నేడు సర్టిఫికెట్ల పరిశీలన..
అర్హత కలిగి, సీనియారిటీ జాబితాలో ఉన్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), తత్సమానమైన కేడర్‌ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 17వ తేదీన నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. సర్వీస్‌ రిజిస్టర్, ఇతర ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 
ఇది వరకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయిన ఉపాధ్యాయులు రావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అన్నీ అనుకూలించి.. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ పదోన్నతుల పర్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఈనెల 22వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

సీనియారిటీ జాబితాను సిద్ధం చేశాం..
ఇటీవలి పదవీవిరమణ చేసి, పదోన్నతులు పొందిన స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులను అర్హులైన ఎస్జీటీలు, తత్సమాన కేడర్‌ కలిగిన ఉపాధ్యాయులతో పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీనియారిటీ జాబితాను సిద్ధం చేశాం. నేడు సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.  – కె.చంద్రకళ, జిల్లా విద్యాఖాధికారి 

మరిన్ని వార్తలు