గురోన్నతి!

21 Jun, 2019 10:01 IST|Sakshi

జిల్లాలో 691 మందికి లబ్ధి

నివేదికలు పంపిన జిల్లా అధికారులు

 మార్గదర్శకాలు రాగానే పదోన్నతులు 

ఉపాధ్యాయుల నాలుగేళ్ల కల సాకారం కానుంది. సీఎంగా    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్‌ బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే టీచర్ల పదోన్నతుల ఫైల్‌లో కదలిక వచ్చింది. జిల్లాలో పదోన్నతులకు అర్హులుగా ఉన్న వారి వివరాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు పంపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌:  నాలుగేళ్లుగా ముందుకు సాగని ఉపాధ్యాయుల పదోన్నతుల అంశంలో కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికలు రాష్ట్రస్థాయి అధికారులకు చేరాయి. జిల్లాలో 4,758 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు 3,693, ప్రాథమికోన్నత పాఠశాలలు 438, ఉన్నత పాఠశాలలు 627 ఉన్నాయి. ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత నాలుగు సంవత్సరాలుగా పదోన్నతులు లేక అదే పోస్టులో కొనసాగాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం పదోన్నతులు సకాలంలో నిర్వహించకపోవడంతో చాలామంది ఉన్న స్థానంలోనే పదవీ విరమణ పొందాల్సిన దుస్థితి. దీంతో చాలామంది నష్టపోయారు.

ప్రతి ఏటా పదోన్నతులు నిర్వహించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ గత పాలకుల అలసత్వంతో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయ్యోర్లకు సంవత్సరాలుగా కలగా ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. జిల్లాలో నాలుగేళ్లుగా పదోన్నతుల ఫైల్‌కు పట్టిన బూజును జిల్లా విద్యాశాఖాధికారులు దులిపారు. కసరత్తు నిర్వహించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన వారిని కేడర్ల వారీగా గుర్తించి ప్రాథమికంగా నివేదికలు తయారు చేశారు. ఆ నివేదికలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు చేరవేశారు.

691 మందికి పదోన్నతులు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 691 మంది ఉపాధ్యాయులకు త్వరలో పదోన్నతులు కల్పించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఆ నివేదికల ప్రకారం జిల్లాలో గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులు 114 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లీష్‌)–53, స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు మీడియం గణితం)– 37, ఉర్దూ మీడియం గణితం – 02, తమిళ మీడియం గణితంలో – 02, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ (తెలుగు మీడియం) – 19, ఉర్దూ మీడియం ఫిజికల్‌ సైన్స్‌– 04, తమిళ మీడియం ఫిజికల్‌ సైన్స్‌ –02, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు మీడియం బయాలజికల్‌ సైన్స్‌ –56, ఉర్దూ మీడియం –01, తమిళ మీడియం –03, స్కూల్‌ అసిస్టెంట్‌ సోషియల్‌ తెలుగుమీడియం – 167, ఉర్ధూ మీడియం –01, తమిళ మీడియం– 04, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు –44, స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ– 17, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉర్దూ –06, స్కూల్‌ అసిస్టెంట్‌ తమిళం –02, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగుమీడియం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ – 19, ఉర్దూ మీడియంలో –01, తమిళ మీడియం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం –01, తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు– 135, ఉర్ధూ మీడియం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు –02 మొత్తం 691 మందికి పదోన్నతులు కలగనున్నాయి.
 
త్వరలో మార్గదర్శకాలు
పదోన్నతులకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయంలో పదోన్నతుల ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. పదోన్నతులకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే కేడర్ల వారీగా పదోన్నతులు కల్పించి నియామక పత్రాలను అందజేస్తారు. గత నాలుగు సంవత్సరాల తర్వాత నూనత ప్రభుత్వంలో పదోన్నతులు వస్తుండడంతో ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కృతజ్ణతలు తెలుపుతున్నారు.  

మరిన్ని వార్తలు