‘రాత్రికి వస్తే రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తా’

24 Jul, 2017 08:51 IST|Sakshi
‘రాత్రికి వస్తే రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తా’
► ఓ ఉపాధ్యాయురాలితో తోటి టీచర్‌ అసభ్య పదజాలం
► అందరిముందు చెప్పులతో కొట్టుకున్న టీచర్లు
► పోలీసులను ఆశ్రయించిన బాధిత ఉపాధ్యాయురాలు
► కేసు నమోదు చేసిన పోలీసులు
 
అనంతపురం:  ‘ఈ రాత్రికి మున్సిపల్‌ కమిషనర్‌ రెస్ట్‌ రూంకు వస్తే... నీకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తా’  అంటూ కదిరి మున్సిపల్‌ పాఠశాలలో పనిచేసే ఓ మహిళా టీచర్‌ పట్ల మున్సిపాలిటీలోనే మరో స్కూల్‌లో పనిచేసే మైనుద్దీన్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళా టీచర్‌ అతనితో గొడవ పడి, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆదివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాలు.. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ‘ఆనంద ఆదివారం’ పేరుతో మున్సిపల్‌ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడికి మున్సిపల్‌ కమిషనర్‌ భవానిప్రసాద్‌తో పాటు మున్సిపల్‌ టీచర్లందరూ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత  మహిళా టీచర్‌ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె ద్విచక్ర వాహనం వద్ద వేచి ఉన్న మైనుద్దీన్‌ ‘మీరు యూఎల్‌బీ(అర్బన్‌ లోకల్‌ బాడీ)కోఆర్డినేటర్‌గా బదిలీ కోసం డీఎంఏ ఆఫీస్‌ నుండి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. కానీ మున్సిపల్‌ కమిషనర్‌ మిమ్మల్ని రిలీవ్‌ చేయలేదని విన్నాను. ఒక పనిచెయ్‌.. ఈ రోజు రాత్రికి కమిషనర్‌ రెస్ట్‌ రూంకు వచ్చి మాతో గడుపు... నీకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తాను’  అని అన్నాడు.  

దీంతో కంగుతిన్న సదరు మహిళా టీచర్‌ వెంటనే ‘నీ భార్యను పిల్చుకెళ్లురా.. నాకు అలాంటి అలవాట్లు లేవు..’  అంటూ చెప్పుతీసుకొని ఆ కామాంధుడిపైకి విసిరింది. అనంతరం ఇద్దరూ చెప్పులతో దాడి చేసుకోగా... అక్కడే ఉన్న ఉపాధ్యాయులు జరిగిన మొత్తం సంఘటనను తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. గొడవ అనంతరం బాధిత మహిళా టీచర్‌ నేరుగా పట్టణ పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యకర పదజాలం ఉపయోగించడమే కాకుండా తనను కులం పేరుతో దూషించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌ పేర్కొన్నారు. దీనిపై మైనుద్దీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఆమెపట్ల ఎటువంటి అసభ్యకర పదజాలం ఉపయోగించలేదని ఆమే తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని పేర్కొన్నాడు.