తిరుగుబాటు

6 Mar, 2014 12:26 IST|Sakshi
తిరుగుబాటు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  డీఈఓ రమేష్ బదిలీ... మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాలు ఊపందుకున్న ఈ సమయంలోనూ రమేష్ బదిలీ వ్యవహారమే తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేయగా... రిలీవ్ చేసేది లేదని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గత నెలలో తేల్చిచెప్పారు. అయితే తాజాగా ఉపాధ్యాయ సంఘాలు ఆమెపై తిరుగుబాటు అస్త్రాన్ని సంధించాయి. రమేష్‌ను బదిలీ చేయకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామంటూ ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు గురువారం  ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు జిల్లా కలెక్టర్‌కు ఒక లేఖ అందజేశారు.

 రోజుకో మలుపు
 డీఈఓ రమేష్‌ను బదిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన్ను బదిలీ చేస్తూ  ఫిబ్రవరి 12 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు డీఈఓ రాజేశ్వర్‌రావును నియమించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆయన్ను రిలీవ్ చేయలేమని, పైగా పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆయన్ను బదిలీ చేయడం కుదరదని కలెక్టర్ తేల్చిచెప్పారు. మార్చి 3 తేదీ వరకు ఆయన ఎన్నికల విధుల్లో ఉంటారని ఆ తర్వాత బదిలీ విషయం పరిశీలిస్తామని చెప్పారు.

ఇదే విషయాన్ని కలెక్టర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి, ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడ రాశారు. ఇక డీఈఓ బదిలీ దాదాపుగా ఆగిపోయిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ డీఈఓ బదిలీ వ్యవహారం తెర మీదకు వచ్చింది. డీఈఓను బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సారి ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ లేఖను వారు జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

 లేఖలో పేర్కొన్న అంశాలు
 నెలవారీ పదోన్నతుల  ప్రక్రియ సరిగా నిర్వహించలేదనీ, కార్యాలయంలో సిటిజన్ చార్టును కూడా  అమలు చేయడం లేదని ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియార్టీ జాబితాను ఎప్పటికప్పుడు ప్రకటించకుండా దాచి పెడుతున్నారని వివరించారు. అంతేకాకుండా అక్రమంగా డిప్యుటేషన్లకు డీఈఓ తెరలేపారని,  ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంలోనూ అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు.

అంతేకాకుండా అనుమతి లేని పాఠశాలలు నడుస్తున్నట్లు డీఈఓకు సమాచారం వచ్చినా.. కొన్ని పాఠశాలల విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరించారని వారు లేఖలో ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కొన్ని సంఘాలను ప్రోత్సహిస్తున్నారని, ఉమ్మడి పరీక్ష నిర్వహణకు ఖర్చు చేయాల్సిన నిధులు కార్యాలయ ఆధునికీకరణ పనులకు డీఈఓ అక్రమంగా వినియోగించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి.  వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వారు కలెక్టర్‌కు లేఖ అందజేశారు. అయితే ఆరోపణలు కాకుండా తగిన ఆధారాలు తీసుకొని వస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఉపాధ్యాయులకు చెప్పి పంపించినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు