అదనపు బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామా

17 Oct, 2017 10:34 IST|Sakshi

ట్రిపుల్‌ఐటీ బోధన సిబ్బంది నిర్ణయం

15రోజులు గడువు అడిగిన డైరెక్టర్‌

అంగీకరించని సిబ్బంది

నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో పని చేస్తున్న మెంటార్లు, ఫ్యాకల్టీలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తదితర సిబ్బంది అందరూ తమకు అదనంగా అప్పగించిన బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. తాము బోధన బాధ్యతతో పాటు విద్యా సంస్థ శ్రేయస్సు దృష్ట్యా మిగిలిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు  యాజమాన్యం తమకు అండగా ఉండటం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో అదనపు బాధ్యతలకు రాజీనామా చేస్తున్నామని డైరెక్టర్‌ ఆచార్య వీరంకి వెంకటదాసుకు రాజీనామా పత్రం అందజేశారు.

రాజీనామాకు అసలు కారణం ఇదే..
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో  ఈ నెల 14న దబ్బాడ రమాదేవి ఆత్మహత్య విషయాన్ని ట్రిపుల్‌ ఐటీ అధికారులు సకాలంలో పోలీసులకు తెలపలేదు. ఉదయం 5.30 గంటలకు ఘటన జరిగితే 11.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై  అదేరోజు రాత్రి డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చీఫ్‌వార్డెన్‌ ఫణికుమార్‌ను పోలీస్‌ స్టేషన్లో ఉంచారు. ఈ విషయం తెలుసుకుని బోధనా సిబ్బంది అంతా పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లడంతో ఫణికుమార్‌ను పంపించేశారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడితే చీఫ్‌ వార్డెన్‌ ఎలా బాధ్యుడవుతారని సిబ్బంది ప్రశ్నించడంతో పాటు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన విషయంలో ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ గాని, వైస్‌ చాన్సలర్‌ గాని చీఫ్‌ వార్డెన్‌కు అండగా నిలబడలేదని సిబ్బంది పేర్కొంటున్నారు. తామందరం అదనంగా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంతో గడిపే సమయాన్ని సైతం కోల్పోతుంటే, చీఫ్‌ వార్డెన్‌ను  పోలీసులు తీసుకెళ్తుంటే డైరెక్టర్‌ గాని, వీసీ గాని ఎందుకు ఒక్కమాట కూడా పోలీసులకు చెప్పలేదని వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతోనే వారంతా కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.   

అదనపు పదవులన్నింటికి రాజీనామా..
ట్రిపుల్‌ఐటీలో దాదాపు 60 మంది బోధనా సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఫైనాన్స్‌ అధికారి నుంచి హెచ్‌వోడీలు, హాస్టల్‌ వార్డెన్‌లు, చీఫ్‌ వార్డెన్‌లు, మెస్‌ ఇన్‌చార్జిలు, మెస్‌ కమిటీ సభ్యులు, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ అధికారులు, కోఆర్డినేటర్లు, హౌస్‌ కీపింగ్‌ కమిటీ ఇన్‌చార్జిలు, సెక్యూరిటీ గార్డు కమిటీ ఇన్‌చార్జిలు, ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఇన్‌చార్జిలు, డీన్‌ అకడమిక్, డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్, విద్యార్థుల క్రమశిక్షణ కమిటీ, ఇలా అనేక కమిటీల బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. దీనిపై డైరెక్టర్‌ ఆచార్య వీరంకి వెంకటదాసు 15 రోజుల గడువు కోరగా, అలాంటిదేమీ లేదని తిరస్కరించారు.

మరిన్ని వార్తలు