శోభా నాగిరెడ్డికి కన్నీటి వీడ్కోలు

26 Apr, 2014 02:26 IST|Sakshi
శోభా నాగిరెడ్డికి కన్నీటి వీడ్కోలు
  • కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చిన అభిమానులు
  • విరిగిన బారికేడ్లు... సహకరించాలని విజ్ఞప్తిచేసిన భూమా
  • నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, భారతి
  • దుకాణాల మూసివేత... ఆళ్లగడ్డ మొత్తం అంతిమయాత్రలోనే
  • కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చేతులమీదుగా అంత్యక్రియలు

    ఆళ్లగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. ఆళ్లగడ్డలోని భూమా స్వగృహంలో ఉంచిన శోభా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, భూమా అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉదయం 9.45 గంటల సమయంలో జనం తాకిడితో బారికేడ్లు విరిగిపోయాయి. పోలీసులు అతికష్టం మీద భూమా నివాసం గేట్లను మూసి వేశారు. దీంతో అంత బాధలో ఉన్నప్పటికీ భూమా నాగిరెడ్డి బయటికి వచ్చి జనాలను సముదాయించే యత్నం చేశారు. ప్రచార రథంపెకైక్కి అభివాదం చేస్తూ బొంగురుపోయిన కంఠంతో ‘‘ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడంలేదు. శోభ మృతదేహాన్ని రోడ్డుపైకి తెచ్చి ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి చూపించే యత్నం చేస్తాను. దయచేసి సహకరించండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత 10.28 గంటలకు శోభ పార్థివదేహాన్ని ట్రాక్టర్‌పైకి చేర్చి అభిమానుల సందర్శనార్థం రోడ్డుపై ఉంచారు. సాయంత్రం 3.30 గంటలకు శోభ పార్థివ దేహానికి చివరిసారి ‘ముత్తై ప్రక్రియ’ను పూర్తిచేసేందుకు ఇంట్లోకి తీసుకెళ్లారు. బంధువులు ఆ కార్యక్రమాలను పూర్తిచేసి అంతిమయాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తీసుకొచ్చారు. శోభమ్మను చూసి అభిమానులు బోరున విలపించారు. ‘దేవుడా ఎంత పని చేశావయ్యా... శోభమ్మను ఇట్టా తీసుకుపోవడానికి నీకు చేతులెట్టా వచ్చాయయ్యా’ అంటూ రోదించారు. కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చేతిలో నిప్పుకుండతో వాహనంలోకి రాగానే అందరూ కంటతడి పెట్టారు. తల్లి పార్థివదేహం వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుమార్తెలు అఖిలప్రియ, మౌనికలను శోభ సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఓదార్చారు. తమ చిన్న చెల్లెల్ని విగతజీవిగా చూసి శోభ అక్కలు రోదించారు. తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి విషాద వదనంతో ఉండిపోయారు. సాయంత్రం 4.16 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతి, వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది.
     

  •  
     అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
     భూమా నివాసం నుంచి టీబీరోడ్డు, గాంధీసెంటర్, పాతబస్టాండ్, కందుకూరు రోడ్డులోని భూమా పొలాల వరకూ యాత్ర సాగింది. కిలోమీటరు మేర అంతిమయాత్ర గంటకు పైగా సాగింది. అంతిమయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డలోని దుకాణదారులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఇళ్లకు తాళాలు వేసి ఆళ్లగడ్డ ప్రజానీకం మొత్తం అంత్యక్రియలకు హాజరయ్యారు. తమ అభిమాన నేత శోభను కడసారి చూసేందుకు దారిలోని దుకాణాలు, మిద్దెలపై గంటల తరబడి ఎదురు చూశారు. వాహనంపై విగతజీవిగా ఉన్న ప్రియతమ నేతను చూసి కంట తడిపెట్టారు. కడసారి చూసేందుకు వచ్చిన జనమంతా యాత్రను అనుసరించారు. అంతిమ యాత్ర కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాదిగా అభిమానులు ఎండను కూడా లెక్కచేయకుండా, మధ్యాహ్నం భోజనం చేయకుండా వేచి ఉన్నారు.
     
    పోలీసు లాంఛనాలతో వీడ్కోలు...
    సాయంత్రం 4.23 గంటలకు మొదలైన అంతిమయాత్ర 5.25 గంటలకు భూమా పొలాల్లోకి చేరింది. పార్థివదే హాన్ని వాహనంపై నుంచి తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎమ్మెల్యే హోదాలో మృతి చెందిన శోభానాగిరెడ్డికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పార్థివదేహాన్ని గంధపుచెక్కల చితిపై పేర్చారు. చివరిసారి భార్యను చూసుకున్న భూమానాగిరెడ్డి బోరున విలపించారు. పక్కనే ఉన్న కుటుంబీకులు, పిల్లలు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి తల్లి చితికి నిప్పంటించారు. కళ్లెదుట కాలిపోతున్న తల్లిని చూసి పిల్లలు.. భార్యను చూసి భూమా.. సోదరిని చూసి ఎస్వీమోహన్‌రెడ్డి సోదరులు, సోదరీమణులు.. తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి.. అభిమానులు.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శోభా నాగిరెడ్డి మృతిని జీర్ణించుకోలేక నంద్యాలలో ఇద్దరు అభిమానులు గుండెపోటుతో మరణించారు.

మరిన్ని వార్తలు