కోస్తా కన్నీరు..

24 Sep, 2016 03:15 IST|Sakshi
కోస్తా కన్నీరు..

సాక్షి, హైదరాబాద్: కోస్తాంధ్రలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.  శుక్రవారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వందలాది గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి, అంధకారం అలుముకుంది. గుంటూరు-నడికుడి-హైదరాబాద్ మార్గంలో కంకర కొట్టుకుపోయి రైలు పట్టాలు పక్కకు వెళ్లడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో భారీ వర్షాలకు కొండచరియ విరిగిపడింది.

రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు భావిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం భూమాయపాలెం గ్రామంలో వాగులో పడి తరుణ్(8) అనే బాలుడు మృతి చెందాడు. కాగా వర్షనష్టంపై సీఎం చంద్రబాబు శుక్రవారం మంత్రులు, అధికారులతో సమీక్షించారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు