అర్హత పరీక్ష!

23 Feb, 2018 11:02 IST|Sakshi
అనంతపురంలోని ఓ కేంద్రంలో టెట్‌ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు , కళావతి

టెట్‌ ఇక్కట్లు ఇంతింతకాదయా!

హిందూపురంలో రెండోరోజూ సాంకేతిక సమస్య

అభ్యర్థుల ఆందోళన.. తలలు పట్టుకున్న అధికారులు

గురువారం పరీక్షకు 63 మంది గైర్హాజరు

ఈమె పేరు కళావతి. బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామానికి చెందిన టెట్‌ అభ్యర్థినికి పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రాన్ని కేటాయించారు. ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకుంది. గురువారం రోజునే ఎంటెక్‌ విద్యార్థులకు పరీక్ష ఉండటంతో విద్యార్థులు కళాశాలఆవరణలోనే నిరీక్షిస్తున్నారు. వారంతా టెట్‌కే వచ్చారని భ్రమించిన కళావతి 9.45గంటలు దాటినా అక్కడే ఉండిపోయింది. చివరకు అనుమానంతో విచారించగాఅసలు విషయం తెలుసుకొనిపరీక్ష హాలులోకి వెళ్లగా అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు ససేమిరాఅన్నారు. ‘సార్‌.. కాళ్లుపట్టుకుంటా అనుమతించండి’అని వేడుకున్నా ఫలితం లేకపోయింది.

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రెండవ రోజు గురువారం కూడా అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. జిల్లా కేంద్రంలోని పీవీకేకే కళాశాల కేంద్రంలో ఆలస్యం కారణంగా ఓ విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. రెండో రోజు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనంతపురం, బెంగళూరు కేంద్రాల్లో మొత్తం 1,468 మంది అభ్యర్థులకు గాను 1,405 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు పీవీకేకే, షిర్డీసాయి ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా పరిశీలకులు జనార్దనరెడ్డి, ఆయా కేంద్రాల పరిశీలకులు కేంద్రాలను తనిఖీ చేశారు. బెంగళూరులో పరిశీలకులు సాయిబాబా వివిధ సెంటర్లను పరిశీలించారు.

రెండోరోజూ ఆ కేంద్రాల్లో అభ్యర్థులు లేరు
జిల్లాలో ఆరు కేంద్రాలు ఉండగా రెండోరోజూ రెండు కేంద్రాలకు అభ్యర్థులను కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్‌ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ రాయలేదు. అలాగే షిర్డీసాయి ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ రెండు పూటలా కేవలం 71 మందిని మాత్రమే కేటాయించారు.

వెంటాడిన సాంకేతిక సమస్య
హిందూపురం సప్తగిరి కళాశాలలో రెండో రోజూ సాంకేతిక సమస్య తలెత్తింది. 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.15 గంటలకు మొదలైంది. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఆన్‌లైన్‌ నిర్వహణపై అవగాహన లేకనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ అభ్యర్థులు వాపోయారు.

మరిన్ని వార్తలు