బైక్‌ ఇచ్చి.. బలయ్యాడు!.

28 Dec, 2019 05:57 IST|Sakshi

చర్చికి వెళుతూ స్నేహితులకు బైక్‌ ఇచ్చిన యువకుడు

ఆ బైక్‌పై వెళుతూ ఓ యువతిని వేధించిన స్నేహితులు

బైక్‌ నంబర్‌ ఆధారంగా యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

తీవ్ర అవమానభారంతో యువకుడి ఆత్మహత్య

తాడేపల్లిరూరల్‌: తన బైక్‌ను స్నేహితులకివ్వడం.. ఆ యువకుడి ప్రాణాలనే బలిగొంది. ఆ స్నేహితులు ఓ యువతిని వేధించడం.. బైక్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో అవమాన భారంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పట్టణ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ చానెల్‌లో(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తున్న తాడేపల్లి ముగ్గురోడ్డు ప్రాంతానికి చెందిన చరణ్‌రాజు తన బైక్‌ను విజయవాడలోని స్నేహితుడు శివ, అతనితోపాటు వచ్చిన మరో యువకుడికి ఈ నెల 24వ తేదీ రాత్రి ఇచ్చి విజయవాడలోని చర్చికి వెళ్లాడు. వారిద్దరూ బైక్‌పై విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ యువతిని ఈవ్‌టీజింగ్‌ చేయడంతో ఆమె వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు చరణ్‌ రాజును అదుపులోకి తీసుకుని రోజంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారించారు. ఈవ్‌ టీజింగ్‌ చేసింది చరణ్‌రాజు కాదని నిర్ధారించుకున్నాక విడిచిపెట్టారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించానంటూ తీవ్ర మనస్తాపం చెందిన చరణ్‌రాజు గురువారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు