చంద్రబాబు సృష్టించుకున్న భ్రమరావతి: తెలకపల్లి

4 Apr, 2019 12:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రజా రాజధానిగా వుండాల్సిన అమరావతి రాజకీయ కారణాలతో వివాదాలకు కేంద్రంగా మారిందని ప్రముఖ రచయిత తెలకపల్లి రవి అన్నారు. రైతుల భూములతో ప్రభుత్వం సింగపూర్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. అయిదేళ్ళ కాలంలో అమరావతి ప్రస్థానంపై అమరావతి అడుగులెటు పుస్తకాన్ని వెలువరించినట్లు చెప్పారు. అమరావతి రాజధాని పరిణామాలపై పుస్తకం అవసరమని భావించానని, అందుకే పుస్తకం రాసినట్లు తెలకపల్లి రవి గురువారమిక్కడ తెలిపారు.

‘అమరావతి అడుగులెటు...?’  పుస్తకావిష్కరణ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ... అమరావతిని సింగపూర్‌ చేస్తానన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో సింగపూర్‌ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. అమరావతికి బ్రాండ్‌ ఇమేజ్‌ తెస్తానన్న ఆయన..ఇప్పుడు డబ్బులు లేవని, బాండ్‌లు జారీ చేస్తూ బాండ్‌ ఇమేజ్‌ తెచ్చారని ఎద్దేవా చేశారు. రైతులను అంబానీలను చేస్తానని చెప్పిన చంద్రబాబు ....కనీసం వారికి ప్లాట్‌లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం కోసం రైతుల భూములను తాకట్టు పెట్టి రూ.30వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చారని, ఇలా ఎన్నివేల కోట్లు అప్పులు తెస్తారని... వాటిని ఎలా తీరుస్తారని ప్రశ్నలు సంధించారు.

రైతుల నుంచి ప్రభుత్వ భూ సమీకరణ చేస్తుంటూ..మరోవైపు ప్రభుత్వం నుంచి సింగపూర్‌ కంపెనీలు భూ సమీకరణ చేస్తున‍్నాయని తెలకపల్లి రవి అన్నారు. అమరావతిలో పదివేల కోట్ల విలువైన భూమిని సింగపూర్‌ కంపెనీలకు కేటాయించారని, పేరు తెలియని కంపెనీలను ప్రభుత్వమే రాజధానిలో ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు కనిపిస్తున్నది అమరావతి కాదని భ్రమరావతి అని అన్నారు. భ్రమరావతి అనేది చంద్రబాబు సృష్టించుకున్న కలల రాజధాని అని ఎద్దేవా చేశారు.

హైకోర్టు, ప్రపంచ బ్యాంకు, ఎస్టీటీ, అంతర్జాతీయ సంస్థలు కూడా దీనిని ఆక్షేపించాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతిని చూసి ఓటు అడగలేకపోవడం చంద్రబాబు నాయుడు వైఫల్యమంటూ ఎండగట్టారు. ఇక్కడ జరిగిన ప్రజా ఉద‍్యమాలే ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ అని తెలకపల్లి రవి పేర్కొన్నారు. అమరావతి ప్రజా రాజధాని అన్నారని, కనీసం ప్రజాస్వామ్య రాజధానిగా కూడా లేదన్నారు. ప్రజలతో ఓ సభ కూడా అమరావతిలో పెట్టుకోలేనివ్వలేదన్నారు. ఇంద్ర సభలా తాత్కాలిక సచివాలయం అన‍్నారని, అయితే చంద్రసభ... లోకేంద్ర సభగా మార్చేశారని తెలకపల్లి రవి విమర్శలు గుప‍్పించారు.

మరిన్ని వార్తలు