ఆర్టీసీపై ‘తెలంగాణ’ బంద్ ఎఫెక్ట్

13 Jul, 2014 03:54 IST|Sakshi

 కర్నూలు(రాజ్‌విహార్): తెలంగాణ బంద్ రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపింది.   పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ  బంద్‌కు పిలుపునివ్వడంతో ఆర్టీసీ అధికారులు తెల్లవారు జామున ఉదయం 5గంటల నుంచే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టారు వైపు వెళ్లే బస్సులన్నీ నిలిపివేశారు. బెంగళూరు, చిత్తూరు, కడప, తిరుపతి నుంచి వచ్చిన సర్వీసులన్నీ కర్నూలు నుంచే వెనక్కి పంపారు.

 మధ్యాహ్నం 2గంటల తరువాత క్రమంగా బస్సులు కదిలాయి. దీంతో ఆర్టీసీకి రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టి.వి. రామం పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు కర్నూలు మీదుగా ప్రతి రోజు 180 బస్సులు తెలంగాణ సెక్టారుకు వెళ్లి వస్తుంటాయి. ఇందులో హైదరాబాద్‌కే 115 బస్సులు తిరుగుతున్నాయి.

 కర్నూలు-1 డిపో చెందిన 10 బస్సులతో పాటు ఎమ్మిగనూరు-8, ఆళ్లగడ్డ-10, కర్నూలు-2 డిపో 14, కోవెలకుంట్ల 6, బనగానపల్లె 9, నంద్యాల 22, డోన్ 12, నందికొట్కూరు 5, ఆదోని 11, ఆత్మకూరు డిపోకు చెందిన 8 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేగాక గద్వాల, అలంపూర్, మహబూబ్ నగర్, ఐజ, శాంతినగర్, కోరాడ, రాయచూర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే కర్నూలు-1, ఆత్మకూరు, కర్నూలు-2 డిపోలకు చెందిన మరో 65 బస్సులు కూడా రద్దయ్యాయి. ఇటు ఇతర జిల్లాల నుంచి వచ్చే మరో 15 బస్సులు కూడా కదల్లేదు. బంద్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు