బంద్ సక్సెస్

6 Dec, 2013 04:29 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ జేఏసీ పిలుపులో బాగంగా గురువారం తలపెట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు సంతకాలు చేసి బయటకు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేశారు. టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు, అనుబంధ సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, వైరా, మధిరతోపాటు అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించారు. నాయకులు ప్రధాన కూడళ్లలో మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు.
 
 మానవహారాలు చేపట్టారు. కళాకారులు ఆటాపాటలతో ప్రదర్శనలు చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌తో నిత్యం జనసందోహంతో ఉండే ప్రధాన వీధులు, వ్యాపార కేంద్రాలు, పెట్రోల్ బంక్‌లు, బస్టాండ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. తెల్లవారుజామున 4 గంటలకే బస్‌డిపోల వద్దకు చేరుకున్న ఉద్యమకారులు  బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో ఒక్క బస్సుకూడా రోడ్డెక్కలేదు. బస్ డిపోలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
 
  ఖమ్మంలో టీఆర్‌ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని షాపులు, వ్యాపార కూడళ్లను మూయించి బంద్‌ను జయప్రదం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ డిపోకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లు, బ్యాంక్‌లు తెరుచుకోలేదు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ప్రరద్శన నిర్వహించి జడ్పీసెంటర్‌లో భారీ మానవహారం నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.ఖాజామియా, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు.
 
  వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. కొణిజర్లలో టీఆర్‌ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయించారు. మండల అధికారులు బంద్‌కు మద్దతు పలికారు. జూలూరుపాడులో టీఆర్‌ఎస్ కార్యకర్తలు అరగుండుతో నిరసన తెలిపారు.
 
  అశ్వారావుపేట నియోజకవర్గంలో టీజేఏసీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్, బైక్ ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట మండలం నారాయణపురంలో వీకేడీవీఎస్‌ఆర్ కళాశాల బస్సును యువకులు అడ్డుకున్నారు. దమ్మపేటలో టీఆర్‌ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు బంద్ పాటించారు. కుక్కునూరు, ముల్కలపల్లి, వేలేరుపాడు, చండ్రుగొండ మండలాల్లో టీఆర్‌ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు.
 
  భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా భద్రాచలంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బ్యాంకులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. దుమ్ముగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి ప్రత్యేక తెలంగాణా ఇప్పించాలంటూ పర్ణశాల రాముడి వద్ద వినతిపత్రం ఉంచారు.
 
  కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. సినిమాహాళ్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పెట్రోల్‌బంక్‌లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొత్తగూడెంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సూపర్‌బజార్ సెంటర్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో సింగరేణి గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.  పాల్వంచలో ఏపీ జెన్‌కో, జేఏసీ ఆధ్వర్యంలో కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
 
     మధిర  నియోకవర్గంలోని మధిర, బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. మధిరలో రాయల తెలంగాణను నిరసిస్తూ టీఆర్‌ఎస్, బీజెపీ, ఎమ్మార్పీఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు మూసివేయించారు.
 
  పాలేరు నియోజకవర్గంలో బంద్ సందర్భంగా గురువారం తెలంగాణావాదులు రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో టీఆర్‌ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేట చౌరస్తాలో టీజేఏసీ, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నాయకన్‌గూడెంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నేలకొండపల్లిలో బీజేపీ,టీజేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.  
 
     ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఇల్లెందులో హోటళ్లు, సినిమా హాళ్లు, దుకాణాలు మూసివేశారు. టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎల్‌డీ, పీడీఎస్‌యూ, ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు.
 
  సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టీఆర్‌ఎస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, బీజేపీ, ఇతర జేఏసీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
 
  పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేశారు. అనంతరం మండలంలోని సారపాక, బూర్గంపాడులలో ధర్నా రాస్తారోకో చేశారు.
 

మరిన్ని వార్తలు