హర్షాతిరేకం

6 Dec, 2013 02:38 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
 ఊహాగానాలకు తెరదించుతూ పది జిల్లాల తెలంగాణను ప్రకటించడం, హైదరాబాద్‌ను యూటీగా మినహాయించడంతో జిల్లాలోని తెలంగాణ వాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గురువారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయిన ప్రజానీకం రాత్రి కేబినెట్ నిర్ణయాన్ని షిండే ప్రకటించడంతో వీధుల్లోకి వచ్చి సంబరాల్లో మునిగి తేలారు. మిఠాయిలు పంచుకుంటూ ‘జై తెలంగాణ’అంటూ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు విభజన బిల్లులో మడతపేచీలు ఉన్నాయనే వార్తలతో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్, టీజేఏసీ పిలుపు ఇవ్వడంతో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసు శాఖ.. ముందస్తు జాగ్రత్తలను చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించిన పోలీసులు.. రాత్రి వరకు గస్తీ నిర్వహించారు.
 
 కాంగ్రెస్‌లో జోష్..!
 అవరోధాల్లేకుండా 10 జిల్లాల తెలంగాణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ వచ్చింది. రాయల తెలంగాణ ప్రచారంతో నాలుగైదు రోజులుగా టెన్షన్‌తో గడిపిన అధికారపార్టీ నేతలకు.. షిండే ప్రకటన ఊరట నిచ్చింది. తెలంగాణను ఆపేందుకే రాయల ప్రతిపాదన తెస్తున్నారనే నిపుణుల విశ్లేషణలతో కలవరపడ్డ నాయకులు చివరకు ఊహించినట్లుగానే ప్రకటన వెలువడడంతో హర్షం వ్యక్తం చేశారు.
 
 గ్రేటర్‌పై పితలాటకం?
 హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిని గవర్నర్ పరిధిలోకి తీసుకురావడంతో జిల్లా అస్తిత్వంపై ప్రభావం చూపనుంది. గవర్నర్ ఆధీనంలోనే శాంతిభద్రతలు ఉంటాయనే కేంద్రం ప్రకటన పోలీసుల పని విభజనను ప్రభావితం చేయనుంది. నగర శివార్లలోని పోలీస్‌స్టేషన్లు సైబ రాబాద్ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో చాలావరకు జీహెచ్‌ఎంసీలో అంతర్భాగంగానే ఉన్నా.. నగరానికి దూరంగా ఉన్న ఠాణాలు ఎవరి ఆధీనంలో ఉంటాయనే అంశంపై అస్పష్టత నెలకొంది. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఉన్న యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం, ఘట్‌కేసర్, మొయినాబాద్, మేడ్చల్, కీసర, శామీర్‌పేట, మేడిపల్లి సహా పోలీస్‌స్టేషన్లు గవర్నర్ ఆధిపత్యంలోకి వెళతాయా? లేదా ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటుచేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సివుంది.
 
 మరోవైపు భూ పరిపాలన, పురపాలన కూడా గవర్నర్ పర్యవేక్షిస్తారనే వార్తలు వస్తున్నాయి. కేంద్రం ఆమోదించిన విభజన బిల్లులో దీనిపై స్పష్టీకరించినప్పటికీ, ఈ వ్యవహారాలు కూడా గవర్నర్ చేతిలోకి వెళ్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్... ఇకపై అటు గవర్నర్, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పది శివారు మున్సిపాలిటీలు 2007లో గ్రేటర్‌లో విలీనమయ్యాయి. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను గ్రేటర్ పాలకవర్గం పర్యవేక్షిస్తుండగా, రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలును జిల్లా కలెక్టర్ చూస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు అంశాలు గవర్నర్ కనుసన్నల్లోకి వెళ్లే అవకాశమున్నట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.

మరిన్ని వార్తలు