ఈ సమావేశాల్లోనే బిల్లు: శరద్ పవార్

31 Jul, 2013 02:08 IST|Sakshi

పార్లమెంటు వచ్చే సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అన్నారు. మెజారిటీ పార్టీలు మద్దతునిస్తాయని, బిల్లు ఆమోదం పొందడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. మంగళవారం యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. యూపీఏ సమన్వయ కమిటీ భేటీలో తెలంగాణ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ‘తెలంగాణ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న సమస్య. ఎప్పటినుంచో అక్కడి ప్రజలు తెలంగాణ కోసం పోరాటాలు చేశారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమని చెప్పింది. తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనూ చేర్చింది. మా పార్టీ సైతం చాలారోజుల క్రితమే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వంతోనూ మాట్లాడి తెలంగాణ ఏర్పాటు చేయాలని విన్నవించాం’ అని పవార్ పేర్కొన్నారు. సమన్వయ కమిటీ భేటీ అనంతరం ఎంపీ లగడపాటి రాజగోపాల్ పవార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు వల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో వివరిస్తూ పలు నివేదికలు సమర్పించారు.

ఈ సమావేశాల్లో అసాధ్యమే: అజిత్‌సింగ్
ఆగస్టు 5 నుంచి మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడం అసాధ్యమేనని ఆర్‌ఎల్‌డీ అధినేత, కేంద్రమంత్రి అజిత్ సింగ్ చెప్పారు. బిల్లు ఎప్పటిలోపు పెడతారనేది చెప్పలేనన్నారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందన్నారు. యూపీఏ సమన్వయ కమిటీ భేటీలో హైదరాబాద్, రాయల తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు. ఈ భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పటిలోపు తెలంగాణ ఏర్పాటవుతుందని అడగ్గా.. ‘‘ఎంత సమయం పడుతుందనేది నాకు తెలియదు. తెలంగాణతో ముడిపడి ఉన్న జలాలు, సరిహద్దులు, హైదరాబాద్, ఆదాయం, ఆర్థిక వనరులపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది’’ అని చెప్పారు. విభజనతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించి పరిష్కరించడానికి మంత్రుల బృందంతో హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని, ఆ కమిటీ విసృ్తత చర్చలు, సంప్రదింపులు జరిపి జలాలు, సరిహద్దుల అంశాలను తేలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు