తెలంగాణ స్వప్నం నెరవేరింది

13 Jan, 2014 00:41 IST|Sakshi
తెలంగాణ స్వప్నం నెరవేరింది

తాండూరు, న్యూస్‌లైన్:  సోనియాగాంధీ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ యాత్ర ముగింపు సభ ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది. ఈసభకు హాజరైన ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నవ నిర్మాణ యాత్రతో కార్తీక్‌రెడ్డి తండ్రి ఇంద్రారెడ్డికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. సీమాంధ్రులు తెలంగాణాను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఆగదని ఆయన స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్‌లో బిల్లు పాసయ్యే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
 
 ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ కోసం ఉద్యమించడం ఆపలేదన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో సబితారెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణానికి పాటుపడతామన్నారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీలను తాము గౌరవిస్తామని, అయితే తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టేనని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీని, శ్రేణులను ఉత్తేజపరుస్తూ యాత్ర చేపట్టిన కార్తీక్‌రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ  కొత్త రాష్ట్రంలో జిల్లాకు చెందిన విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియాగాంధీ పాదాలకు మొక్కినా తప్పులేదన్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెర దించుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. జిల్లాలో తన కొడుకు కార్తీక్‌రెడ్డి ఐదు రోజుల పాదయాత్రకు అండగా నిలబడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
 
 ఉద్విగ్నతకు లోనైన కార్తీక్‌రెడ్డి
 ఐదు రోజులపాటు జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన కార్తీక్‌రెడ్డి వేదికపై ఉద్విగ్నానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అమ్మమ్మగారి ఊరైన తాండూరులో తన పాదయాత్రకు ఘన స్వాగతం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఐదు రోజుల పాదయాత్రకు  అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలన్నారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందున సోనియాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పాదయాత్ర చేశానన్నారు. కొత్త రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఆర్థిక వనరుల విషయంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇంద్రారెడ్డి కొడుకుగా, పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు. కాగా జై తెలంగాణ నినాదాలతో సభ మారుమోగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్‌కుమార్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్,తాండూరు కాంగ్రెస్ నాయకులు కాలె యాదయ్య, రాంమోహన్‌రెడ్డి,  యాదయ్య,రమేష్, విశ్వనాథ్‌గౌడ్, సిటీ కేబుల్ ఎండీ నర్సింహ్మారెడ్డి(బాబు), దారాసింగ్, రాకేష్, అపూ, మల్లిఖార్జున్, ప్రభాకర్‌గౌడ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. అంతకుముందు కార్తీక్‌రెడ్డిని కార్తకర్తలు గజమాలతో సన్మానించారు.

మరిన్ని వార్తలు