పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి

29 Aug, 2013 01:53 IST|Sakshi
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో  బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే ఒప్పుకునేది లేదని పేర్కొంటూ టీవీవీ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించనున్న రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను ఆయన బుధవారం సిద్దిపేటలో ఆవిష్కరించారు. 
 
 అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో భవిష్యత్తు ఉన్న సుమారు వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు, విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగాల ఫలితంగానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ  ప్రకటన చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో నడుస్తున్న ఉద్యమాలను సాకుగా చూపి రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేయవద్దని సూచించారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షులు డి.విజయ్ అధ్యక్షతన జరిగే రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు గంగాపురం సత్తయ్య, టీవీవీ జిల్లా కన్వీనర్ విజయ్, డివిజన్ కన్వీనర్ హరీష్ నాయకులు స్వామి, సాయికుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు