విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధం

14 Feb, 2014 02:52 IST|Sakshi
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీఎన్‌జీఓ, వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో టీడీపీ నాయకులు రైల్‌రోకో చేపట్టారు. బంద్ ప్రభావంతో జిల్లా కేంద్రం బోసిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.  వైద్య ఉద్యోగులు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. విభజనకు సహకరిస్తున్న పాలకులకు  ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. 
 
 విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ :  రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం రాజ్యంగ విరుద్ధమని విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మా మిడి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం గా గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కోసం కేసీఆర్, కోదండరాంరెడ్డి తెలుగు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల వల్ల ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారి విభజించు..  పాలించు పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు బిల్లును అడ్డుకుని సోనియాగాంధీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో  మహా సభ జిల్లా కోకన్వీనర్ మద్దిల సోంబాబు, కార్యదర్శి కిశోర్, విద్యార్ధి సంఘ నాయకులు భరత్, శ్యామ్, పాల్గొన్నారు.
 
 చరిత్ర హీనులవుతారు.. 
 విజయనగరం మున్సిపాలిటీ  : 
 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లును సీమాంధ్రకు చెందిన ఎంపీలందరూ పార్టీలకతీతంగా అడ్డుకోవాలని, లేనిపక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు విమర్శించారు. బంద్‌లో భాగంగా టీడీపీ నాయకులు రైల్‌రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోనియాగాంధీ దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే తెలుగు ప్రజలందరూ నష్టపోతారని చెప్పారు. 
 కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.ఎన్.ఎం.రాజు, మన్యాల కృష్ణ, వి.వి.ప్రసాద్, కనకల మురళీమోహన్, ప్రసాదుల రామకృష్ణ, సైలాడ త్రినాథ్, మైలపల్లి పైడిరాజు, మోహనరావు, నైదాన శ్రీను, కోండ్రు శ్రీనువాసరావు, గెదేల ఆదిబాబు, మద్దాల ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.
 
 జాతి విద్రోహులను ప్రజలు క్షమించరు 
 విజయనగరం టౌన్ :రాష్ట్ర పునర్విభజనకు పూనుకున్న కాంగ్రెస్, టీడీపీ జాతి విద్రోహులను ప్రజలు ఎప్పటికీ  క్షమించరని  వైఎస్సార్‌సీపీ  నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ అన్నారు. ఏపీఎన్‌జీఓలు పిలుపునిచ్చిన బంద్‌కు  ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి సుమారు వంద బైక్‌లపై ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి  బాలాజీ రోడ్డు, కోట జంక్షన్,  మూడులాంతర్లు,  కన్యకాపరమేశ్వరీ కోవెల మీదుగా గూడ్స్‌షెడ్ , బాలాజీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో  పర్యటించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ,  పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లు పూర్తిగా తప్పుడు తడకలతో కూడుకున్నదన్నారు. చట్టాల పట్ల గౌరవం లేని యూపీఏ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని  డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ  ఓట్లు, సీట్ల కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని   విభజిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు  రాంబార్కి సత్యం, నామాల సర్వేశ్వరరావు, బొద్దూరు లక్ష్మణరావు, తొగరోతు నారాయణప్పడు, మొయిద ఆదిబాబు,  వంకర గురుమూర్తి, వాజా మంగమ్మ, సియ్యాదుల శేఖర్, సతీష్‌రెడ్డి, పొట్నూరు శివ, సాధుకృష్ణ, భీమరశెట్టి ఉపేంద్ర,  అలమండ గౌరి, పూల్‌బాగ్ నారాయణ, దేవి, పడగల శ్రీను అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 అందరూ పోరాడాలి  
 విజయనగరం లీగల్ : విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి అందరూ పోరాడాలని రాష్ట్ర బార్ కౌన్సెల్ సభ్యుడు కేవీఎన్ తమ్మన్నశెట్టి, పట్టణ న్యాయవాదులు సంఘ అధ్యక్షుడు జి.రామ్మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విభజన బిల్లును అడ్డుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం తమ్మన్నశెట్టి మాట్లాడుతూ, ఈ నెల 17న ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు న్యాయవాదులు భారీగా హాజరవుతారని చెప్పారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో  సంఘ కార్యదర్శి శివప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు.
 
 బిల్లును వ్యతిరేకించాలి
 విజయనగరం ఆరోగ్యం : సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు మూకుమ్మడిగా విభజన బిల్లును వ్యతిరేకించాలని వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి. ఇజ్రాయిల్ కోరారు. స్థానిక కేంద్రాస్పత్రి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. అనంతరం సోనియా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సోనియా డౌన్ డౌన్, యూపీఐ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇజ్రాయిల్ మాట్లాడుతూ, సోనియాగాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  వైద్యులు సత్యశేఖర్, మధుకర్, సత్యశ్రీనివాస్, శ్రీకాంత్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు ఆచారి, ఉమాపతి, భువనేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు