ఊరూరా.. ఉత్సవం

22 Feb, 2014 02:53 IST|Sakshi
ఊరూరా.. ఉత్సవం

వరంగల్, న్యూస్‌లైన్ : అస్సోయ్‌దులా...జై తెలంగాణ అంటూ జనం దుంకాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో తెలంగాణవాదులు ర్యాలీ లతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన సెంటర్లు జాతరను తలపిస్తున్నాయి. న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల విజయోత్సవ ర్యాలీలతో జిల్లా దద్దరిల్లుతోంది. శుక్రవారం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎల్‌డీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించా రు. కుంకుమ, రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. తీన్‌మార్ చప్పుళ్లకు ఆనందంతో స్టెప్పులేశారు. సోని యాగాంధీ, సుష్మాస్వరాజ్, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

హన్మకొండ, పరకాల. వరంగల్, జనగామ, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, మరిపెడల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. మిటాయిలు పంపిణీ చేసి ఆనందోత్సాహాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ భవన్‌లో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేశారు. ములుగురోడ్డులో విద్యుత్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చి న విద్యార్థులకు కాజీపేటలో ఘనస్వాగతం పలికారు. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద విద్యుత్ జేఏసీ, బీసీ జేఏసీ, సీపీఐ, వడుప్సా, లెక్చరర్ ఫోరం, యూనివర్సీటీ పీజీ కళాశాల విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు వందలాదిగా తరలివచ్చి ర్యాలీలతో హోరెత్తించారు. రెండు గంటలపాటు ఈ సెంటర్ తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. పలు మండల కేంద్రాల్లో బీజేపీ, ప్రజాసంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కళాకారుల ఆటాపాటలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు