రేణుక రాకపై రగడ!

16 Sep, 2013 12:46 IST|Sakshi
రేణుక రాకపై రగడ!

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి కలకలం రేపారు.  ఆదివారం మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ నేతల సమావేశానికి ఎంపీ రేణుకాచౌదరి రావడం చర్చనీయాంశమైంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రేణుకాచౌదరి రాకపట్ల సమావేశం ఆరంభంలోనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెను సమావేశానికి ఎందుకు పిలిచారని నిర్వాహకులను నిలదీశారు. ‘కనీసం ఆత్మ గౌరవం లేకుంటే ఎలా? పిలిస్తే మాత్రం ఎందుకు వచ్చినట్లు? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు? సిగ్గూ, జ్ఞానం ఉన్నవారెవరూ రారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా సమావేశానికి రావడం అవివేకం’ అని మండిపడ్డారు.

దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒక దశలో వారిద్దరూ సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వగా జానారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సర్దిచెప్పారు. ఇంత జరుగుతున్నా రేణుకా చౌదరి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారని సమాచారం. కాగా, సమావేశం జరుగుతుండగానే ఉస్మానియా జేఏసీ విద్యార్థులు అక్కడికి వచ్చారు. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు