సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సద్భావన సభ!

11 Sep, 2013 03:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 21 లేదా 22 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కేంద్రంపై ఒత్తిడితోపాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కేవలం కాంగ్రెస్‌వల్లే సాధ్యమవుతోందన్న భావం ప్రజల్లో కలిగేలా ఈ సభను ఏర్పాటు చేయాలని సంకల్పిం చారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. మంత్రులు కె.జానారెడ్డి, జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్‌కుమార్, ఎంపీలు మధుయాష్కీ, అంజన్‌కుమార్ యాదవ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎం.ఎ. ఖాన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ ’సభ, సీఎం కిరణ్ తీరు తది తర అంశాలపై సమావేశంలో నేతల మధ్య చర్చ సాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును  కేంద్రం సాధ్యమైనంత త్వరగా పూర్తిచే సి పార్లమెంటులో ఆమోదింపచేయాల్సిన అవసరముందని సమావేశం అభిప్రాయపడింది. ఆహారభద్రతా బిల్లు ఆమోదం పొందడం, కేంద్రంలో రాజకీయ పరిణామాలు రోజుకోరకంగా మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే  ఇబ్బందుల్లో పడతామన్న భావనను కొందరు నేతలు వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితులు రాకముందే తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదింపజేసేలా చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
 
 టీఆర్‌ఎస్‌కు దీటుగా కార్యక్రమాలు
 తెలంగాణ ఏర్పాటుపై పూర్తి బాధ్యత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వహిస్తుండగా ఆ క్రెడిట్‌ను తన్నుకుపోయేలా టీఆర్‌ఎస్ చురుగ్గా కదులుతోందని సమావేశంలో చర్చ సాగింది. ఇటీవల ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో సభ నిర్వహించడం, టీఆర్‌ఎస్ కూడా త్వరలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నందున కాంగ్రెస్ తరఫున కూడా హైదరాబాద్‌లో సభ పెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు. దీనికి సద్భావనా సభగా పేరుపెడితే బాగుం టుందని కొందరు సూచించారు. సభను ఈనెల 21 లేదా 22 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈనెల 15న టీ కాంగ్రెస్ ప్రజాప్రతిని దులు, ఇతర నేతలతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌పై మూడురకాల ప్రతిపాదనలున్నాయని షిండే చెప్పడంపై నేతల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ఉద్యోగుల సమస్యలపై కన్నా రాజకీ యాంశాలను ప్రస్తావించడాన్ని సమావేశం తప్పుబట్టింది.
 
 
  కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం మొత్తానికి సీఎంగా వ్యవహరించట్లేదని, కేవలం సీమాంధ్రప్రాంత నేతగా ప్రవర్తిస్తున్నారని పలువురు మండిపడ్డారు. ఢిల్లీలో తెలంగాణ ప్రక్రియపై జరుగుతున్న కదలికల గురించి మధుయాష్కీ వివరించారు. పార్లమెంటులో సోనియాను ఇటలీ వనితని తీవ్రపదజాలంతో విమర్శించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ సంస్థకు కంతనపల్లి ప్రాజెక్టును అత్యధిక అంచనాలతో అప్పగించడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అభ్యంతరం లేవనెత్తారు. రూ. అయిదారువందల కోట్లు అధికంగా అంచనాలు పెంచి కాంట్రాక్టును అప్పగించారని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరముందని ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు.
 
 జేసీ రాయల తెలంగానం: టీ కాంగ్రెస్ నేతల  భేటీ జరుగుతున్న సమయంలో సీనియర్‌నేత జేసీ దివాకర్‌రెడ్డి సీఎల్పీకి వచ్చారు. సమావేశం జరుగుతున్న రూంలోకి వెళ్లి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నవ్వుతూ నినదించారు.
 
 దీంతో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘జై తెలంగాణ’ అని గట్టిగా నినదించారు. కనీసం తమ రెండు జిల్లాల(అనంతపురం, కర్నూలు)ను కలుపుకొని రాయల తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని, అలాకాకుంటే నీటి సమస్యలతో తాము భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని జేసీ చెప్పారు. అలా కాకపోతే సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్నదే తమ అభిప్రాయమన్నారు. సమైక్యాంధ్ర అనే మాటే లేదని, తెలంగాణకు అనుకూలంగా ఉంటే తొలిగవర్నర్‌గా మిమ్మల్నే ఆహ్వానిస్తామని నేతలు ప్రతిపాదించగా జేసీ బయటకు వచ్చేశారు.

>
మరిన్ని వార్తలు