తెలంగాణకే కరెంట్ కెపాసిటీ!

7 Aug, 2013 02:42 IST|Sakshi
తెలంగాణకే కరెంట్ కెపాసిటీ!

 జెన్‌కో ఆస్తులు, ప్లాంట్ల సామర్థ్యం ఇక్కడే ఎక్కువ  ఆస్తులతో పోలిస్తే.. అప్పులూ తక్కువే
  తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.12,500 కోట్లు.. అప్పులు 6,800 కోట్లు
  ఆంధ్రాలో ఆస్తులు 6,800 కోట్లు, అప్పులు 4,539 కోట్లు
  జెన్‌కో ప్లాంట్ల సామర్థ్యంలో 54% తెలంగాణలో.. 46% ఆంధ్రలో..

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తమ్మీద జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆస్తులతో పోలిస్తే.. అప్పులు తక్కువగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.12,500 కోట్లు. ఈ ప్లాంట్ల కోసం తెచ్చిన అప్పులు రూ.6,800 కోట్లు మాత్రమే. అంటే ఆస్తులు-అప్పుల నిష్పత్తి 100:54.4గా ఉందన్నమాట. అదే ఆంధ్రా ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.6,800 కోట్లు కాగా అప్పులు రూ.4,539 కోట్లు ఉన్నాయి.
 
  ఆస్తులు-అప్పుల నిష్పత్తి 100:66.75 శాతంగా ఉంది. అయితే, ఇరు ప్రాంతాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిధులతో నిర్మించిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటు(1,600 మెగావాట్లు) ఆస్తులు-అప్పులు రెండూ రూ.8 వేల కోట్లుగా ఉన్నాయి. ఇది ఇరు ప్రాంతాలకు చెందనుంది. ప్రతీ ప్రభుత్వ విభాగం నుంచి ఆస్తులు-అప్పుల వివరాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే సేకరించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంధనశాఖ కూడా ఇరు ప్రాంతాల్లోని ఆస్తులు-అప్పుల వివరాలను సేకరిస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి ఇంధనశాఖ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. విభజన అనంతరం కూడా ఈ అప్పులను మరో 15 ఏళ్లపాటూ చెల్లించాల్సి ఉంటుందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఆధారంగా చూస్తే మాత్రం ఆంధ్రాలోనే అధిక విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి.
 
 తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2282.5 మెగావాట్లు కాగా.. ఆంధ్రా ప్రాంతంలో 2810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే, జల విద్యుత్ ప్లాంట్లు మాత్రం తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2541.8 మెగావాట్లు. ఆంధ్రా ప్రాంతంలో 1287.6 మెగావాట్లు మాత్రమే. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను పరిగణనలోని తీసుకుంటే ఆంధ్రా ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఎక్కువగా ఉంది. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా జెన్‌కోకు 8924.86 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ ప్రాంతంలో 4825.26 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అంటే మొత్తం జెన్‌కో సామర్థ్యంలో 54 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఇక ఆంధ్రా ప్రాంతంలో 4099.60 మెగావాట్ల ప్లాంట్లు... అంటే 46 శాతం ఉన్నాయి. 

మరిన్ని వార్తలు