‘టీ’ జోష్

5 Oct, 2013 01:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
 తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లాలో రెండో రోజూ ఆనందోత్సాహాలు మిన్నంటాయి. పెత్రామాస రోజే పెద్ద పండుగ వచ్చిందంటూ శుక్రవారం తెలంగాణవాదులు సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్, మంచి ర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యా యి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఐ, న్యూడెమోక్రసీతోపాటు రాజకీయ జేఏసీ, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదుల జేఏసీలు, వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి, తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. పెత్రమాస సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారికి బియ్యం ఇచ్చి స్మరించుకున్నారు. తెలంగాణ ఏర్పాటుపై తక్షణమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని పలువురు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటును కోరుతూ ఆదిలాబాద్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 1370వ రోజుకు చేరాయి.
 
 పల్లెపల్లెన ర్యాలీలు, సంబరాలు
 ఆదిలాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదులు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, బీ జేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, జనగాం సంతోష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లిలో సీపీఐ, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రదర్శనలు జరిగాయి. సీపీఐ కార్యాలయం నుంచి కాంటా చౌరస్తా వరకు ఎర్ర జెండాలతో కమ్యూనిస్టులు ప్రదర్శన చేశారు. సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కార్యక్రమంలో పాల్గొని పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టా రు. నిర్మల్‌లో మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఎల్‌ఎఫ్ కన్వీనర్‌గా 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలోని సోనియాగాంధీ తదితర నాయకులకు వినతిపత్రం అందజేయడంతోపాటు అప్పటి నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు కార్యకర్తలు ఆయనను పూలమాలలతో సత్కరించారు. అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి.
 
     మంచిర్యాల ఐబీ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఏర్పాటుపై సంబరాలు జరుపుతూ మిఠాయిలు పంచుకున్నారు. ముస్లిం సోదరులు బస్టాండ్ సమీపంలో మిఠాయిలు పంపిణీ చేశారు. పెత్రామాస సందర్భంగా మంచిర్యాలలో పెద్దలకు బియ్యం ఇచ్చే క్రమంలో తెలంగాణ అమరులకు బియ్యం తెలంగాణవాదుల ఆధ్వర్యంలో ఇచ్చారు. సీమాంధ్రులు ఎన్నికుట్రలు చేసినా తెలంగాణ నోట్ ఆమోదం పొందిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. మంచిర్యా ల, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్‌లో సింగరేణి కార్మికులుతెలంగాణ నోట్ వెలువడిన నేపథ్యంలో సంబురాలు నిర్వహించారు. తెలంగాణ నోట్ ఆమోదంపై గనుల్లో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. శ్రీరాంపూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చుతూ మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దండేపల్లి మండల కేంద్రంలో టపాసులు పేల్చి తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.
 
     ఉట్నూర్ మండలంలో ఎంపీ రాథోడ్ రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లును కాంగ్రెస్ వెంటనే ప్రవేశపెట్టాలని, తెలంగాణ ఏర్పాటుకు మొ ట్టమొదటి ఓటు తానే వేస్తానన్నారు. జేఏసీ కోకన్వీనర్ షెడ్మకె సీతారాం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి హరినాయక్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఆయా మండలాల్లో టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచిపెట్టడం, తెలంగాణ విగ్రహాల కు పాలాభిషేకం చేయడం లాంటి కార్యక్రమాలను నిర్వహిం చారు. కడెం మండలంలో జేఏసీ కన్వీనర్ వెంకటరమణ, కాం గ్రెస్ మండల అధ్యక్షుడు మైసయ్య ఆధ్వర్యంలో జన్నారం మండలంలో టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సత్యం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి హరినాయక్, జేఏసీ కన్వీనర్ వీరాచారి ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు గంగారాం, ఇంద్రవెల్లి మండలంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆరె వెంకటేష్ పాల్గొన్నారు.
 
     నిర్మల్‌లో జేఏసీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, పంచాయతీ రాజ్ ఇంజినీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వ హించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
 
     ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సంబరాలు నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి, టపాసులు పేల్చారు. మిఠాయీలూ పంచారు. కాసిపేట గనిపై ఐఎన్‌టీయూసీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో గేట్‌మీటింగ్ జరిగింది.
 
     తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలుపడంతో చెన్నూర్‌లో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కృష్ణ, యూత్ కాంగ్రెస్ తనుగుల రవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మందమర్రిలో బ్లాక్  కాంగ్రెస్ ఉపేందర్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేయగా, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంవేణు అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జైపూర్ మండలం భీమారం గ్రామంలో సీఎస్‌ఆర్ యువసేన ఆధ్వర్యంలో పొడేటి రవి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
 
     బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ నోట్ ఆమోదంపై టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో టపాసులు పేల్చారు. సొనాలలో టీఆర్‌ఎస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. బజార్‌హత్నూర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. తలమడుగు మండలం రుయ్యాడిలో టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు.
 
     సిర్పూర్ నియోజకవర్గం కాగజ్‌నగర్, దహెగాంలో సంబురాలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్ ఆధ్వర్యంలో, దహెగాంలో యువకులు సంబరాలను జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు.

మరిన్ని వార్తలు