తెలంగాణను అడ్డుకుంటే సహించం

18 Nov, 2013 03:32 IST|Sakshi

చెన్నారావుపేట, న్యూస్‌లైన్ :  సమన్యాయం పేరిట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును పరోక్షంగా హెచ్చరించారు. ఒకవేళ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రకియను జాప్యం చేస్తే రానున్న ఎన్నికల్లో ఈ ప్రాంతంలో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఈటెల ముఖ్య అతిథిగా మాట్లాడారు.

ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ అనుకూలమని చెప్పి పార్టీ నాయకులతో ముందుగా కేంద్రానికి లేఖ ఇచ్చిన బాబు... ఇప్పుడు రెండు ప్రాంతాలకు సమన్యాయమంటూ విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.

వేలాది మంది విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదని.. మన తాతలు 1919లోనే నిజాం రాజులను ఎదురించారని ఆయన గుర్తు చేశారు. 1952లో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ బాల్యంలో ఉన్నప్పుడు మా ఉద్యోగాలు మాకే కావాలని ఉద్యమిస్తున్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఏడుగురిని బలితీసుకుందని, 1969లో 370 మంది తెలంగాణ ప్రజలు ఆంధ్రా పోలీసుల చేతిలో హతమయ్యారని చెప్పారు.

ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఓరుగల్లు.. పోరుగల్లుగా మారి ఉద్యమించిందని, ఈ జిల్లాకు తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణను ఎలాగైనా అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నాడని.. ఆయనకాదు.. ఆయనలాంటి లక్షలాది మంది అశోక్‌బాబులు అడ్డుపడినా రాష్ట్రం ఏర్పడక తప్పదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే హైదరాబాద్ రాజధానితో కూడిన 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణను ఏర్పాటు చేయాలని... లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కేయూ ప్రొఫెసర్ సాంబయ్య, నాయకులు మార్నేని రవీందర్, హరినాథ్‌సింగ్, భద్రయ్య పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు