రాయలకు ఒప్పుకోం

1 Dec, 2013 23:39 IST|Sakshi

వర్గల్, న్యూస్‌లైన్:  హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణకు ఒప్పుకోబోమని  మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం గౌరారంలో జరిగిన వర్గల్, ములుగు మండలాల టీఆర్‌ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కిరికిరి పెడితే మరో పోరాటానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో నోరు మెదపని, రాజీనామాలతో పదవీ త్యాగం చేయాలంటే పారిపోయినవారు తెలంగాణ పేరిట  సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని నాయిని ధ్వజమెత్తారు.

మద్రాస్ రాష్ట్రంలో తమకు అటెండర్ పోస్ట్ విషయంలో అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కోరిన సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో రెండు లక్షల ఉద్యోగాలను అనుభావిస్తున్నారని అన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రేమ, అనురాగాల ప్రాధాన్యత తెలియదని, సీఎం పదవి కోసం పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన ఘనుడని ఎదేవా చేశారు. టీఆర్‌ఎస్ చేపట్టిన ఉద్యమాలతోనే తెలంగాణ ఆవిర్భావం జరుగనుందన్నారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన పది జిల్లాల తెలంగాణే మాలక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి,  పార్టీ రాష్ట్ర నాయకులు సరేష్‌గౌడ్, ఎలక్షన్ రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్,  పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు