'టీటీడీపీ నాయకులు ఆడోమగో తేల్చుకోవాలి'

4 Mar, 2014 00:20 IST|Sakshi
'టీటీడీపీ నాయకులు ఆడోమగో తేల్చుకోవాలి'

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నాయకులు తము ఆడో, మగో తేల్చుకోవాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదని, ఆపార్టీలో కొనసాగితే ఎటూ కానివారిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతిని కలిశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ‘సామాజిక తెలంగాణ’ అనే మాటను ఉచ్చరించే అర్హత కూడా లేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కోరినట్లు తెలిపారు. జులై 30న సీడబ్ల్యుసీ నిర్ణయం వెలువడిన తరువాత కిరణ్ తీసుకున్న వివక్షపూరిత నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని గవ ర్నర్‌ను కలిసి కోరినట్లు చెప్పారు.

బదిలీలు, అభివృద్ధి కార్యక్రమాలు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఇతర పాలసీ నిర్ణయాలన్నింటి వెనుక సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయనపై కూడా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని సీలేరు 450 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును, పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రకు కేటాయించడం అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ సీఎంగా కొనసాగిన కిరణ్‌కుమార్ రెడ్డి మాట తప్పినట్లు కేసీఆర్ విలీనం విషయంలో మాట తప్పరని ఆయన భరోసా వ్యక్తం చేశారు. విలీనం కాకపోతే ఘర్షణలతో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు