వీర తెలంగాణ పోరుకు 66 ఏళ్లు!

17 Sep, 2013 01:33 IST|Sakshi
వీర తెలంగాణ పోరుకు 66 ఏళ్లు!

సాక్షి, హైదరాబాద్:  భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం బందూకులు చేత బట్టి రజాకార్లను తరిమికొట్టిన వీరతెలంగాణ సాయుధ పోరాటం 66వ వార్షికోత్సవాలను వివిధ కమ్యూనిస్టు పార్టీలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, ఎంసీపీఐ-యు, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) సంయుక్తంగా వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం ఆరింటికి జరిగే ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు, కె.నారాయణ, గుర్రం విజయ్‌కుమార్, ఎండీ గౌస్, ఎన్.మూర్తి పాల్గొంటున్నారు. తారీఖులు, దస్తావేజులను పక్కనబెడితే ఈ పోరాటానికి 1947 సెప్టెంబర్ 11న అంకురార్పణ జరిగిందని కమ్యూనిస్టులు చెబుతుంటారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ మొదలు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి,  మల్లు స్వరాజ్యం వరకు ఎందరెందరో ఈ వీరోచిత పోరాటానికి నాయకత్వం వహించారు.
 
 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి : బీజేపీ
 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(సెప్టెంబర్ 17) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు, పార్టీలే స్వచ్ఛందంగా జాతీయ పతాకాలను ఆవిష్కరించి విమోచన దినోత్సవ చరిత్రను భావితరాలకు గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు