సిమ్‌ కొంటున్నారా.. అయితే జాగ్రత్త!

13 Jul, 2018 08:40 IST|Sakshi

క్షణాల్లో ఇంటి గుట్టు బహిర్గతం

వాట్సప్‌ గ్రూపుల్లో ఫొటోలు ప్రత్యక్షం..

వినియోగదారుల్లో ఆందోళన

సాక్షి, ఉలవపాడు : సాధారణంగా సిమ్‌ కొంటే కొనేవారి వివరాలు సదరు షాపునకు అందజేస్తే అక్కడి నుంచి నేరుగా సంబంధిత నెట్‌వర్క్‌ మెయిన్‌ ఆఫీస్‌కు వెళ్లేవి. అక్కడి నుంచి సిమ్‌ని యాక్టివేట్‌ చేసే వారు. ఈ ఇద్దరి మధ్య మాత్రమే మన వివరాలు ఉండేవి. అలాంటి సమయంలోనే ఎన్నో తప్పులు దొర్లాయి. ఇప్పుడు కొత్తగా వేలిముద్రతో సిమ్‌లు అందజేస్తున్నారు. ఈ సమయంలో మనకు సంబంధించిన వివరాలు మొత్తం వచ్చేస్తున్నాయి. దాని ఆధారంగా సిమ్‌లు అమ్ముతున్నారు. కానీ ఇటీవల కొన్ని టెలికమ్‌ కంపెనీలు తమ వద్ద కొన్న సిమ్‌లు తీసుకున్న వారిని నిలబెట్టి ఫొటో తీస్తున్నారు. తర్వాత వారి ద్వారా పూర్తి చేసిన సమాచారం మొత్తాన్ని ఆయా కంపెనీల గ్రూప్‌ల్లో పోస్టు చేస్తున్నారు. ఈ గ్రూప్‌ల్లో జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని సెల్‌షాపు యజమానులు ఉంటారు.

అంటే ఎక్కడైనా ఓ వ్యక్తి సిమ్‌ కొంటే దానికి సంబంధించి అతని ఫొటోతో పాటు అన్ని వివరాలు బహిర్గతం చేస్తున్నారు. ఇది కంపెనీల తప్పనిసరి కాదని పలు షాపు యజమానులు చెబుతున్నారు. వారు కేవలం ఎన్ని సిమ్‌లు అమ్మారని అడుగుతున్నారు. కానీ కొందరు అన్ని వివరాలు పెట్టి తాము సిమ్‌లు అమ్మిన వారిని కూడా చూపిస్తున్నారని తెలిపారు. సదరు వ్యక్తి ఇలా సిమ్‌ కొనే సమయంలో షాపులో నిలబెట్టి మరీ ఫొటోలు తీస్తున్నారు. అలా అయితేనే సిమ్‌ ఇస్తామని కొందరు యజమానులు చెబుతున్నారు. ప్రధానంగా అక్షరాస్యత లేని వారిని ఇలా చేస్తున్నారు. దీని వలన ఈ గ్రూపులో ఉన్న వారెవరైనా ఈ సమాచారం తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుకలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతా బహిర్గతం 
ఇలా వాట్సాప్‌ గ్రూప్‌లో సిమ్‌ కొన్న వారి సమాచారం మొత్తం పెడుతున్నారు. ఈ గ్రూప్‌లో చూస్తే సిమ్‌ కొన్న వ్యక్తి ఫొటో వస్తోంది. ఆ తర్వాత అతను సిమ్‌ దరఖాస్తులో పూర్తి చేసిన సమాచారం మొత్తం పోస్టు చేస్తున్నారు. ఆధార్‌ ఆధారంగా వారి ఇంటి అడ్రస్సు కూడా బహిర్గతమవుతోంది. ఇక పుట్టిన తేదీతో సహా తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకుంటున్న సిమ్‌ నంబర్‌ వివరాలు, అవసరం కోసం ప్రస్తుతం వాడుతున్న నంబరుతో సహా అన్ని వివరాలు గ్రూప్‌లోకి వస్తున్నాయి. గ్రూప్‌లో వందల మంది షాపుల యజమానులు ఉంటారు. ఈ సమాచారం మొత్తం అందరికీ వస్తుంది. వారు డౌన్‌లోడ్‌ చేసుకుని మరే ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. మహిళలు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు.

ఆందోళనలో వినియోగదారులు 
సిమ్‌లు కొన్న తర్వాత ఇలా గ్రూప్‌లో పెడుతున్నారని చాలామందికి తెలియదు. తెలుసుకున్న తర్వాత వారు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆధార్‌ నంబర్‌ ఉపయోగించుకుని ఏం చేస్తారోనని భయం పట్టుకుంది. ఇక గ్రూప్‌ సభ్యుల్లో అందరూ ఒకేలా ఉండరు. మహిళల ఫోన్‌ నంబర్లు తీసుకోవడంతో పాటు వారికి కాల్‌ చేయడం, మెసేజ్‌ చేయడం వంటివి జరుగుతాయోమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సిమ్‌ అమ్మిన వారు ఇలా సమాచారం బహిర్గతం చేయడం మంచి పద్ధతి కాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమాచారాన్ని బహిర్గతం చేయడంతో ఎలాంటి అసాంఘిక పనులైనా వారి మీద మరొకరు చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు. వినియోగదారుల వివరాలు సెల్‌ షాపుల యజమానుల గ్రూప్‌లో పెట్డడం నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటాం: సెల్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం మంచిది కాదు. సిమ్‌ కంపెనీల యజమానులు అలా ఎందుకు చేస్తున్నారో విచారించి చర్యలు తీసుకుంటాం. - వైవీ రమణయ్య, ఎస్‌ఐ, ఉలవపాడు

మరిన్ని వార్తలు