ఎన్నికల వరకు నాన్చడానికే ‘సీడబ్ల్యూసీ’ వ్యూహం?

13 Jul, 2013 04:44 IST|Sakshi

- ఆహార భద్రత బిల్లునూ కోర్ కమిటీలో చర్చించి ఆర్డినెన్స్ ఇచ్చారు
- తెలంగాణను సీడబ్ల్యూసీ కోర్టులోకి నెట్టడంలో ఆంతర్యమేమిటి?
- తర్వాతి దశలోనూ పార్టీ పరంగా నిర్ణయం ప్రకటించటానికే పరిమితం
- ఆపై యూపీఏ సమన్వయ కమిటీలోకి బంతిని పంపే యోచన
- ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ఎన్నికల ఎజెండాగా చేసుకోవడమే కాంగ్రెస్ వ్యూహం.. ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లో సీట్లే లక్ష్యం!
- నిజానికి 2004 లోనే వర్కింగ్ కమిటీలో తెలంగాణ అంశంపై చర్చ
- కొత్తగా మళ్లీ సీడబ్ల్యూసీలో ఏం చర్చిస్తారంటున్న విశ్లేషకులు

సాక్షి, హైదరాబాద్: కోర్ కమిటీ సమావేశంలో ఏదో ఒకటి తేల్చేస్తామంటూ హడావుడి చేసిన కాంగ్రెస్ తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మరోసారి దాటవేత వైఖరి ఎందుకు ప్రదర్శించింది? ఉన్నట్టుండి తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో చర్చించి నిర్ణయిస్తామని ఎందుకు ప్రకటించింది? ఇటీవలి కాలంలో ఆహార భద్రత బిల్లు వంటి జాతీయస్థాయి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని సైతం కోర్ కమిటీలో చర్చించి ఆ వెంటనే ఆర్డినెన్స్ చేయించిన కాంగ్రెస్ నాయకత్వం.. తెలంగాణ అంశంలో మాత్రం ఎందుకు విస్తృతస్థాయి సభ్యత్వం కలిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది? ఢిల్లీలో శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కోర్ కమిటీ సమావేశం తెలంగాణపై తేల్చకుండా పార్టీలో విస్తృత స్థాయి చర్చకు ప్రతిపాదించటం వ్యూహాత్మకంగానే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ అంశాన్ని వచ్చే ఎన్నికల ఎజెండాగా మాత్రమే చూస్తోందని, ఆ కోణంలోనే నిర్ణయాలు చేస్తోందని సర్వత్రా వినిపిస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలోనూ తెలంగాణ అంశంపై పార్టీ పరమైన నిర్ణయాన్ని వెల్లడించటమే తప్ప ప్రభుత్వ పరంగా కార్యరూపంలో పెట్టకూడదన్న ఆలోచనతో ఉన్నట్లు చెప్తున్నారు. పార్టీ పరంగా తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పటం వరకే పరిమితం కావటం, తెలంగాణపై ప్రభుత్వ పరంగా రాజ్యాంగం ప్రకారం పూర్తి చేయాల్సిన అంశాన్ని సాగదీసి దాన్ని ఎన్నికల ఎజెండాగా చేసుకోవాలన్న దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

ముందు పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ...
శుక్రవారం సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తేల్చుతుందని సర్వత్రా భావించారు. అయితే ఏ నిర్ణయమూ తీసుకోకుండానే కోర్ కమిటీ సమావేశాన్ని ముగించి తెలంగాణ బంతిని వర్కింగ్ కమిటీ కోర్టులోకి నెట్టింది. రెండు వారాల్లో సీడబ్ల్యూసీ సమావేశం కానున్నట్లు ఆ పార్టీ నుంచి సమాచారం బయటకు వస్తోంది. అయితే సీడ బ్ల్యూసీ ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో నేతలెవరికీ ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెలాఖరుతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుండగా ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకు దాటవేయాలన్న ఉద్దేశంతోనే కోర్ కమిటీ ఎజెండాను వర్కింగ్ కమిటీలోకి నెట్టేసినట్లు కనపడుతోంది.

ముందస్తు ఎన్నికల వరకు సాగదీత...
వర్కింగ్ కమిటీలో చర్చించాక కూడా తెలంగాణపై పార్టీ వైఖరిని వెల్లడించటం వరకే కాంగ్రెస్ పరిమితమవుతుందని తెలుస్తోంది. వర్కింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం వెల్లడించే సమయానికి లేదా ప్రకటించిన అంశాన్ని ప్రభుత్వ పరంగా అమలులో పెట్టటానికి మధ్య చాలా సమయం పడుతుందని, ఈలోగా నవంబర్‌లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు తప్పవని, ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై పార్లమెంటులో జరగాల్సిన ప్రక్రియ ఏదీ జరక్కుండా కేవలం ఎన్నికల అంశంగా చేసుకోవాలన్న వ్యూహంతోనే పార్టీ నాయకత్వం వెళుతోందన్న భావన కాంగ్రెస్ నేతల్లో ఉంది. నిజానికి సీడబ్ల్యూసీ 2004కు ముందు జరిగిన సమావేశంలోనే ఈ అంశంపై చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగానే 2004లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. మొదటి ఎస్సార్సీని గౌరవిస్తూనే తెలంగాణ, విధర్భ వంటి చిన్న రాష్ట్రాల డిమాండ్ల పరిష్కారానికి మరో ఎస్సార్సీ వేస్తున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొనటమే కాకుండా దాంట్లో ఈ అంశం సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయించినట్లుగా చాలా స్పష్టంగా పేర్కొంది. అలాంటప్పుడు ఈ అంశాన్ని మరోసారి వర్కింగ్ కమిటీ కోర్టులోకి ఎందుకు నెట్టినట్లన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రణబ్‌ముఖర్జీ కమిటీ, తరువాత రోశయ్య కమిటీ, ఆపై శ్రీకృష్ణ కమిటీ ఇప్పుడు కోర్ కమిటీ, ఆపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తరువాత యూపీఏ సమన్వయ కమిటీ ఇలా ఒకదానిపై ఒకటిగా కమిటీలు లేదా పార్లమెంట్ ప్రక్రియ పేరుతో ఈ అంశాన్ని ఎన్నికల వరకు సాగతీయటమే కాంగ్రెస్ వ్యూహమన్నది తాజా సంఘటనలతో స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు.

రెండు ప్రాంతాల్లో లోక్‌సభ సీట్లపై కన్ను...
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలోనే సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభావం, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తీవ్రంగా ఉన్నట్లు అంచనాకు వచ్చి.. రెండు ప్రాంతాల్లోని లోక్‌సభ సీట్లపై దృష్టి సారించిన కాంగ్రెస్ ఆ కోణంలోనే తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణ నేతలతో రాష్ట్ర సాధన సభను పెట్టించటంతో పాటు కోర్ కమిటీలో నిర్ణయమంటూ ఆశలు రేకెత్తించింది. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టి.. అక్కడ ప్రభుత్వంపై, ప్రభుత్వ అసమర్థతపై నెలకొనివున్న ప్రజావ్యతిరేకతను పక్కదోవ పట్టించాలన్నది పార్టీ వ్యూహంగా చెప్తున్నారు.

విస్తృత కమిటీలో నిర్ణయం సాధ్యమేనా?
కాంగ్రెస్‌లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల నిర్ణయాన్ని ఎవరూ కాదనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అలా పరిమిత సంఖ్యలో ఉన్న కోర్ కమిటీలో నిర్ణయం సాధ్యం కానప్పుడు విస్తృతస్థాయిలో 41 మంది సభ్యులున్న వర్కింగ్ కమిటీలో ఎలా సాధ్యపడుతుంది? వర్కింగ్ కమిటీలో గూర్ఖాలాండ్‌తో ముడిపడి ఉన్న పశ్చిమబెంగాల్, విదర్భ అంశమున్న మహారాష్ట్రతో పాటు ఇలాంటి డిమాండ్లున్న రాష్ట్రాల నేతలు కూడా సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తమ రాష్ట్రాల్లోనూ విభజన డిమాండ్లు మళ్లీ ఊపందుకుంటాయని వారి నుంచి అభ ్యంతరాలు వ్యక ్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వర్కింగ్ కమిటీలో 21 మంది సభ్యులు ఉండగా 15 మంది శాశ్వత ఆహ్వానితులు, మరో ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల్లో జి.సంజీవరెడ్డి మినహా.. మిగతా 40 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్కరు కూడా రాష్ట్రానికి చెందిన వారు లేరు.

మరిన్ని వార్తలు