టీ ఉన్నత విద్యామండలి చట్టవిరుద్ధం

4 Aug, 2014 02:16 IST|Sakshi
టీ ఉన్నత విద్యామండలి చట్టవిరుద్ధం

గవర్నర్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రుల ఫిర్యాదు.. న్యాయం చేయాలని వినతి
 
హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే కల్పించుకొని న్యాయం చేయాలని కోరారు. ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవే శాలుంటాయని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, అందుకు విరుద్ధంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేశారని చెప్పారు. విభజన చట్టంలో ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం వేరేగా కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తుంద ని, ఈ విషయంలో కల్పించుకోవలసిన బాధ్యత గవర్నర్‌కే ఉంటుందని మంత్రులు తెలిపారు.

ఆగస్టు 1వ తేదీలోగా కౌన్సెలింగ్ ముగించి 15వ తేదీలోగా క్లాసులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఇదివరకే సూచించిందని, తెలంగాణ ప్రభుత్వ తీరు ఇందుకు భిన్నంగా ఉందని వారు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎంలు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ తీరు వల్ల రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని చెప్పారు. ‘‘సమైక్య రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా అన్ని ప్రాంతాల విద్యార్థులకు న్యాయం జరిగింది. ఈ ఏడాది కూడా సకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. అయితే, కౌన్సెలింగ్ ఆలస్యం చేయడంతో తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఆందోళనతో ఉన్నారు. దీనిపై చర్చిద్దాం రండన్నా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేయడాన్ని మేం సమ్మతించం. ఇక్కడి ప్రవేశాలు వేరుగా చేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానికేతరులుగా మారి అవకాశాలు కోల్పోతారు’’ అని చెప్పారు. సోమవారం సుప్రీం కోర్టు నుంచి వచ్చే తీర్పులో స్పష్టత ఉంటే ఇబ్బంది ఉండదని, ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ కూడా అభిప్రాయపడ్డారని తెలిపారు. గవర్నర్‌తో భేటీకి ముందు ఉప ముఖ్యమంత్రులు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు ఏపీ సీఎంతో భేటీ అయ్యారు.
 

మరిన్ని వార్తలు