100 రోజుల పాలనలో ఒరిగింది శూన్యం

16 Sep, 2014 01:35 IST|Sakshi
100 రోజుల పాలనలో ఒరిగింది శూన్యం

- ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు
- వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలరాజు విమర్శ
బుట్టాయగూడెం : చంద్రబాబు 100 రోజుల పాలనలో అబద్ధాలు, మోసపూరిత మాటలు తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కి అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. రుణాలను మాఫీ చేస్తానంటూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన బాబు కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులు, డ్వాక్రా మహిళలను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. 100 రోజుల టీడీపీ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని, తొలిసంతకానికి చంద్రబాబు అర్థం లేకుండా చేశారని బాలరాజు విమర్శించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి  ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం పెట్టి రైతుల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్‌సీ, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ పెంపు, పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పేద మహిళలకు స్మార్ట్ సెల్‌ఫోన్‌లు వంటి హామీలు ఏమయ్యాయో ఆయనకు, టీడీపీ నాయకులకే తెలియాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని , ఎన్నికుట్రలు కుతంత్రలు చేసినా తమ పార్టీని అడ్డుకోలేరని బాలరాజు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు