అమ్మ భాషకు పునరుజ్జీవం

20 Nov, 2019 04:34 IST|Sakshi

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ 

ఒకటి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు 

అధికార భాషా సంఘం ఏర్పాటు, తెలుగు అకాడమీ పునరుద్ధరణ  

ప్రభుత్వ చొరవ పట్ల సాహితీవేత్తల హర్షం

సాక్షి, అమరావతి/ఒంగోలు మెట్రో:  తెలుగు భాషకు మంచిరోజులొస్తున్నాయి. మాతృభాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీలను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా చేసింది. భాష, సంస్కృతుల వికాసానికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపట్టడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో తెలుగు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు భాషాభిమానులు ఆందోళనలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక అధికార భాషా సంఘాన్ని నియమించలేదు. తెలుగు అకాడమీ ఏర్పా టును అసలు పట్టించుకోలేదు. తెలుగు భాషాభివృద్ధికి భాషావేత్తల సూచనలు, డిమాండ్లను చంద్రబాబు బేఖాతరు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఎన్నో వినతులిచ్చినా పెడచెవిన పెట్టారు. ‘తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది తప్ప.. చంద్రబాబు మనసులో తెలుగుకు స్థానం లేదు’ అని భాషాభిమానులు తీవ్రంగా విమర్శించారు.

తెలుగుకు మళ్లీ వెలుగులు 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు భాషా వికాసానికి గట్టి చర్యలు చేపట్టారు. పరిపాలనలో తెలుగు వినియోగం, భాషాభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు. దానికి తెలుగు, హిందీ భాషల్లో పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ప్రముఖ సాహితీవేత్తలు మోదుగుల పాపిరెడ్డి, షేక్‌ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్‌ జ్యోత్సా్నరాణిలను అధికార భాషా సంఘం సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. తెలుగు అకాడమిని పునరుద్ధరించారు. ప్రముఖ రచయిత్రి, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతిని ఆ అకాడమి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్తున్నారు. అదే విధంగా 1 నుంచి పదో తరగతి వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు గానీ ఉర్దూగానీ తప్పనిసరి చేసి అమ్మభాష తప్పనిసరిగా నేర్చుకునేట్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉర్దూ అకాడమీని కూడా పునరుద్ధరించనుంది. భాషాభివృద్ధికి ప్రభు త్వం చేపడుతున్న చర్యల పట్ల సాహిత్యాభిమానులు, విద్యా వేత్తలు, సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భాష పురోగతికి  బాటలు
‘ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది’ అని గురజాడ చెప్పినట్టు ప్రభుత్వం ఒక మహిళ అయిన నందమూరి లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ బాధ్యతలు అప్పగించింది. తద్వారా తెలుగు భాష పురోగతికి బాటలు వేసింది. 
– సింహాద్రి జ్యోతిర్మయి, ఉపాధ్యక్షురాలు, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం

సంతోషం  కలిగిస్తోంది
సీఎం వైఎస్‌ జగన్‌.. మదర్సాల ఉన్నతికి చర్యలు చేపట్టడమే కాకుండా ఉర్దూ అకాడమీని పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వీటిని గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేస్తే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకోవడం ముదావహం.
– డాక్టర్‌ షాకీర్, విద్యావేత్త

తెలుగు అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు
తెలుగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. భాషావేత్తలు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్న విధంగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. దాంతో భావితరాలకు కూడా తెలుగును మరింత చేరువ చేసింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో తెలుగు భాషను ఏమాత్రం విస్మరించ లేదు. 
– యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు

భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది  
తెలుగు భాషాభివృద్ధికి, వికాసానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే అధికార భాషా సంఘాన్ని నియమించింది. తెలుగు అకాడమీని పునరుద్ధరించింది. పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. అంతమాత్రాన తెలుగును తీసేయడం లేదు. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేశారు.  
– నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు అకాడమి అధ్యక్షురాలు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా