డబ్బుకు ‘దేశం’ దాసోహం

19 Apr, 2014 02:11 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగుదేశం పార్టీలో డబ్బులున్న వారికే సీట్లు ఇస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా ధనిక నేతలకు లొంగిపోయారు. పనిచేసే నాయకులు, కార్యకర్తలకు విలువ లేకుండాపోయింది’ ఈ మాటలు అంటున్నది టీడీపీ ప్రత్యర్థులు కాదు. ఆ పార్టీ నేతలే. నిన్నటివరకూ ఆచంట టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిం చిన గుబ్బల తమ్మయ్య ఈ విషయూన్ని కుండబద్దలుకొట్టి మరీ చెప్పారు. డబ్బులిస్తేనే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొల్లులో టీడీపీ సీనియర్ నేత డాక్టర్ బాబ్జి నేరుగా ఈ మాటలు అనకపోయినా ఆయన అనుయాయులంతా అదే చెబుతున్నారు.

పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీ ధనరాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన డబ్బులు కుమ్మరించి టీడీపీని జేబు సంస్థగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు తెగిపోయేదాకా రావడానికి ఆయనే ప్రధాన కారణమని తెలుగుదేశం నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజు చెప్పినట్టల్లా చంద్రబాబు తలాడించడానికి ఆయన భారీ మొత్తం లో సొమ్ము ఇవ్వటమే కారణమనే ప్రచా రం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.

 మొన్నటివరకూ బీజేపీ నేతగా చెలామ ణీ అయ్యి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని రఘు కొద్దిరోజులుగా చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం బీజేపీకి ఇస్తారని తెలిసి.. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావించి ముందే ఆ పార్టీలో చేరిన ఆయన అందుకోసం బాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. నరసాపురం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చంతా తానే భరిస్తానని అవసరమైతే, జిల్లాలోని మిగిలిన స్థానాల ఖర్చు  కూడా చూసుకుంటానని ఆయన ముందుకొచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీంతోపాటు పార్టీ ఫండ్ కూడా భారీగా ఇవ్వడానికి  ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

 ఈ కారణంగానే రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం వరకూ ఏలూరులో బస చేసిన చంద్రబాబు 11 గంటల వరకూ బయటకు రాలేదు. ఈ సమయంలో ఉదయం నుంచి ఫోన్లు మాట్లాడిన ఆయన ఇక్కడినుంచి వెళ్లిపోయే ముందు రఘురామకృష్ణంరాజును మాత్రమే పిలిపించుకుని మాట్లాడారు. టీడీపీ నేతలెవరితోనూ మాట్లాడలేదు. దీనినిబట్టి బీజేపీలో ఉన్న రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 ఎవరైనా సరే..
 ఆచంట సీటును మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఇవ్వడం వెనుకా పార్టీ ఫండ్ లోగుట్టు ఉన్నట్లు తెలిసింది. ఈ సీటును రెండు నెలల క్రితమే తమ్మయ్యకు ఇస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు చివరకు పితాని సత్యనారాయణకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. పితాని ఆర్థికంగా బలవంతుడు కావడంతో తమ్మయ్యను పక్కనపెట్టేశారు. కనీసం ఆయనకు మాటమాత్రమైనా చెప్పకుండా పితానికి సీటిస్తున్నట్లు ప్రకటించారు.

 పాలకొల్లు అసెంబ్లీ సీటు సీనియర్ నాయకుడైన డాక్టర్ బాబ్జికి వస్తుందని అంతా భావించారు. అనూహ్యంగా నిమ్మల రామానాయుడికి కట్టబెట్టారు. ఉంగుటూరు సీటు ఇస్తానని పలువురిని పార్టీలో చేర్చుకున్నా.. చివరకు గన్ని వీరాంజనేయుల్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు కూడా చివరకు భారీగా పార్టీ ఫండ్ ముట్టజెప్పుకోవాల్సి వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి ఆగమేఘాల మీద ఆయన డబ్బును సమకూర్చినట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం సీటు ఆశిస్తున్న కొట్టు సత్యనారాయణ కూడా ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం.

 తొలి విడతలో ప్రకటించిన ఏలూరు, దెందులూరు, నిడదవోలు, తణుకుతోపాటు మిగిలిన జనరల్ నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి కూడా పార్టీ ఫండ్ సమీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీ ఫండ్ సమర్పించుకోవాల్సిందేనని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీ జిల్లా పరిశీలకునిగా ఉన్న గరికపాటి రామ్మోహనరావు ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొందరి విషయంలో మాత్రం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోక్యం చేసుకుని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. వాస్తవ పరిస్థితులు తెలియడంతో తెలుగుదేశం పార్టీలో జరిగేదంతా ధన రాజకీయమేనని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు