నగ కాదు.. నగదు కొట్టండి

19 Sep, 2014 02:18 IST|Sakshi
నగ కాదు.. నగదు కొట్టండి

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తివిరి ఇసుమున తైలంబుదీయవచ్చు...’ అన్న వేమన పద్యంలోని మొదటి వాక్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్షరాలా అవలంబిస్తున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాల్సిన అధికార పార్టీ నేతలు అక్రమార్కులను కోట్లాది రూపాయలు ఇచ్చే బంగారు బాతుల్లా భావిస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు అదును దొరకడంతో ఇసుక అక్రమ వ్యాపారుల నుంచి వసూళ్లకు తెరలేపినట్టు తెలుస్తోంది. గురువారం జిల్లాకు చెందిన అక్రమ ఇసుక వ్యాపారులు అధికార పార్టీ నేతతో భారీ డీల్ కుదుర్చుకోవాలని చూసినా సదరు నేత రూ.కోటికి ఇండెంట్ పెట్టడంతో అదికాస్తా ఫెరుులైందని అంటున్నారు. ఇటీవల అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన లారీల్లోని ఇసుకను జిల్లా అధికారులు సీజ్  చేశారు.
 
 దానిని రిలీజ్ చేసే ఉత్తర్వులపై సంతకాలు చేయించుకునేందుకు గురువారం సాయంత్రం ప్రస్తుతం ‘పవర్’లో ఉన్న ఓ అధికార పార్టీ నేత వద్దకు ఇసుక వ్యాపారులు వెళ్లారు. ఈ పని చేసిపెట్టేందుకు లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు నగను బహుమానంగా ఇచ్చారు. అయినా సదరు నేత తృప్తి చెందలేదట. రూ.కోటి నగదును నజరానాగా సమర్పిస్తే కానీ ఇసుకను రిలీజ్ చేసే ఉత్తర్వులు ఇచ్చేది లేదని మొండికేశారట. చివరగా సాగిన బేరసారాల అనంతరం యూనిట్‌కు రూ.500 ఇచ్చేందుకు ఇసుక మాఫియా సభ్యులు అంగీకరించినా.. యూనిట్‌కు  (ఇసుక విలువపై లెక్కవేస్తే రూ.కోటి పైనే) సమర్పిస్తేనే అనుమతి ఇస్తానని సదరు నేత తేల్చేశారట. ఇప్పుడు రూ.కోటి  ఇస్తే భవిష్యత్‌లో ప్రతి డీల్‌కూ అంతే డిమాండ్ చేస్తారని భావించి.. లెక్కలు వేసుకున్న ఇసుక మాఫియా సభ్యులు అంత ఇచ్చుకోలేమంటూ అర్ధాంతరంగా చర్చలు ముగించి బయటకు వచ్చేశారట.
 

మరిన్ని వార్తలు