రౌడీరాజ్యం!

12 Feb, 2018 11:24 IST|Sakshi

రాప్తాడు నియోజకవర్గంలో గాడి తప్పిన శాంతిభద్రతలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ

ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దౌర్జన్యకాండ

పోలీసుల ఏకపక్ష తీరుపై సర్వత్రా విమర్శలు

వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి ఈ నెల ఏడో తేదీన రామగిరి మండలంలో పర్యటించారు. నసనకోట పంచాయతీకి చెందిన బోయ సూర్యనారాయణ అలియాస్‌ సూర్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రశేఖర్‌రెడ్డి వెంటే ఉన్నాడు. ఇది తెలుసుకున్న టీడీపీ వారు బోయ సూర్యనారాయణపై దాడి చేసి గాయపరిచారు. పైగా అతడిని స్టేషన్‌కు పిలుచుకెళ్లి తనపై వైఎస్సార్‌సీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డే దాడి చేయించినట్లు కేసు పెట్టించారు.

తమ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటిస్తున్నారనే సమాచారంతో రామగిరి మండలం పేరూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు సుబ్బుకృష్ణ 2017 నవంబరు 12న గ్రామంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సుబ్బుకృష్ణపై దాడి చేసి తిరిగి అతనిపైనే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ఈ రెండు ఉదాహరణలు చాలు రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు ఎలా గాడితప్పాయనేందుకు.

అనంతపురం:  ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమ భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ రాప్తాడు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, వారి బంధువులు చెప్పినట్లు వినాల్సిందే. మాట వినని వారిపై పోలీసులను ఉసిగొలుపుతున్నారు. ‘ఎద్దు ఈనిందంటే గాడికి కట్టేయ్‌’ అన్న చందంగా పోలీసుల తీరు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉంటూ తప్పొప్పులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేసులు నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చివరికి తెగబడి అధికారులపై కూడా దాడులు చేస్తుంటే చోద్యం చూడాల్సిన పరిస్థితి. కనగానపల్లి ఎంపీపీ భర్త ముకుందనాయుడు స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారు.  

రామగిరి ప్రవేశానికి ప్రత్యేక ఆంక్షలు
రామగిరి మండలంలోకి విపక్ష నేతలు వెళ్లనీయకుండా ప్రత్యేక ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్న పోలీసులు.. విపక్షనేతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసుల ఏకపక్ష తీరుపై ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలను పరిరక్షించకపోతే అధికార పార్టీ నేతల ఆగడాలు మరింత ఎక్కువవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 
అధికార పార్టీ ఆగడాల్లో కొన్ని..

► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులు అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించడానికి వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై కూడా దాడికి యత్నించారు.  

► 2016 సెప్టెంబర్‌ 2న వైఎస్‌ వర్ధంతి రోజున కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి.  

► 2016 నవంబరు 16న రాప్తాడు మండలం బండమీదపల్లిలో మంత్రి లోకేష్‌ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీలు చింపేశారనే సాకుతో యర్రగుంటలో ఓ మహిళపై టీడీపీ నాయకులు దాడి చేశారు.  

► గొందిరెడ్డిపల్లిలో 2017 నవంబరులో భూ సమస్య కారణంగా సర్పంచ్‌ కుమారుడు బాబయ్య, బంధువులపై టీడీపీ వారు దాడి చేశారు.

ఓటమి భయంతోనే ఫ్యాక్షన్‌కు బీజం
మంత్రి సునీతపై ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ధ్వజం  

ఆత్మకూరు: ఎన్నికలకు ముందే ఓటమి భయం వెంటాడటంతో మంత్రి పరిటాల సునీత ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ఆరోపించారు. ఫ్యాక్షన్‌ సంస్కృతిని ఆత్మకూరుకు తీసుకురావద్దంటూ ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్‌ మీనుగ నాగరాజుపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క హామీనీ పూర్తిగా నెరవేర్చకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. ఎలాగైనా గెలిచేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫ్యాక్షన్‌కు బీజం వేస్తున్నారని మండిపడ్డారు.

ఇందులో భాగంగానే రామగిరి మండలంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటించకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారని విరుచుకుపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే మంత్రిని కూడా నియోజకవర్గంలో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మంత్రి సోదరుడు బాలాజీ వైఎస్సార్‌సీపీ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, అమాయక ప్రజలను నేర వృత్తిలోకి బలవంతంగా దింపుతున్నారని అన్నారు. అనంతరం గూలి కేశవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉండగా ..వాటిని పూర్తిగా రద్దు పరిచి కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారన్నారు. ఆత్మకూరుకు లిఫ్ట్‌ ఇరిగేష్‌న్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలంటూ వినతిపత్రం అందచేశారు.    

మరిన్ని వార్తలు