తెలుగుదేశం పార్టీ శవ రాజకీయం

23 Nov, 2019 12:10 IST|Sakshi

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త

జగన్‌ ప్రభుత్వమే చంపిందంటూ నారా లోకేష్‌ రాద్ధాంతం  

సాక్షి, ప్రత్తిపాడు/కాకుమాను: గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నవ శ్రీనివాసరావు(47) ఈ నెల 11వ తేదీన ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 12వ తేదీన జీజీహెచ్‌లో పోలీసులు శ్రీనివాసరావు భార్య అనసూయ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అప్పుల బాధతోనే తన భర్త పురుగు మందు తాగాడని ఆమె పేర్కొంది. 15వ తేదీన శ్రీనివాసరావు మరణించాడు. అయితే, అతడి మరణాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ శుక్రవారం ప్రత్తిపాడులో బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాసరావు ఏ తప్పు చేయకున్నా దొంగ కేసు పెట్టి, హింసించి, వేధించి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చంపేసిందంటూ ఆరోపించారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీనివాసరావుపై ఓ కేసు నమోదైంది. తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రత్తిపాడుకు చెందిన నాగమణి 2018 జూలై 22న ఉన్నవ శ్రీనివాసరావుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

లోకేష్‌ పద్ధతి మార్చుకోవాలి: హోం మంత్రి
శవ రాజకీయాలు చేస్తున్న నారా లోకేష్‌ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం హితవు పలికారు. టీడీపీ పాలనలో అధికారులకు సైతం రక్షణ లేకుండా చేసిన మీరా ప్రజల గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు