చీపురుపల్లి దేశంలో బీజేపీ లొల్లి

2 Apr, 2014 06:25 IST|Sakshi
 చీపురుపల్లి, న్యూస్‌లైన్:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాషాయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చీపురుపల్లి తెలుగుదేశం క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీతో పొత్తు అవసరమే గానీ ఇలా తమ పీకలు మీదకు వస్తుందనుకోలేదంటూ నియోజకవర్గ నేతలు  మధనపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటున్న తరుణంలో జిల్లా నుంచి ఒక స్థానాన్ని బీజేపీ కోరుతోంది. దీంతో చీపురుపల్లిని ఆ పార్టీకి కేటాయిస్తారన్న చేదు సమాచారం నియోజకవర్గ తెలుగుదేశం నేతలకు మింగుడుపడడం లేదు. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని క్యాడర్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. 
 
 రాష్ట్ర వ్యాప్తంగా బలపడాలని చూస్తున్న బీజే పీ, పొత్తులో భాగంగా  జిల్లాకో స్థానం చొప్పున కోరుతున్నట్టు తెలుస్తోంది. అందులో గజపతినగరం అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కోరుతుండగా, చీపురుపల్లి  స్థానాన్ని కేటాయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇప్పటికే జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను  సిద్ధం చేసిన టీడీపీ, చీపురుపల్లి అభ్యర్థిని ఇంతవరకూ తేల్చలేదు.  ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావుతో పాటు శ్రీకాకుళం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కిమిడి మృణాళిని చీపురుపల్లి అసెంబ్లీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వీరు కాకుండా మరికొంత మంది స్థానిక నేతలు కూడా బీసీ నినాదంతో టిక్కెట్టు కావాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వీరిలో ఎవరికో ఒకరికి టికెట్టు ఇస్తే మిగతా వారితో ఇబ్బందులు తప్పవని భావించిన పార్టీ అధిష్టానం ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే  మంచిదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
 ఇదే ప్రచారం ప్రస్తుతం నియోజకవర్గంలో జోరుగా సాగుతుండడంతో పార్టీ క్యాడర్‌లో నైరాశ్యం అలముకుంది. ఇంతకాలం పార్టీని నమ్ముకుని, ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో అవస్థలు ఎదుర్కొంటూ, కేసులు భరిస్తూ ఉంటే తీరా ఎన్నికలు సమయానికి బీజేపీకి స్థానం కేటాయిస్తే ఎలా అంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి బొత్స నియోజకవర్గం కావడంతో ఎన్నో కష్టాలకు ఓర్చి పార్టీలో ఉంటే ఇప్పుడు బీజేపీకి కేటాయిస్తే సహించేది లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 
మరిన్ని వార్తలు